తెలంగాణలో గురుకులాలు మూసివేసేందుకు ప్రభుత్వం కుట్రచేస్తుందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఢిల్లీకి మూటలు పంపేందుకు పైసలు ఉన్నాయి.. కమీషన్లు వచ్చే బడా కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపులకు వేల కోట్లు ఉన్నాయి కానీ.. పేద విద్యార్థుల చదువుకునే గురుకులాల అద్దెలు చెల్లించడానికి పైసలు లేవా ?.. సిగ్గు, సిగ్గు.. ఇది గురుకులాలు శాశ్వతంగా మూసివేసే కుట్ర లాగా కనబడుతుంది అని కేటీఆర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
అద్దె ఇవ్వలేదని రెసిడెన్షియల్ స్కూళ్లకు తాళాలు
యాదాద్రి భువనగిరి , సూర్యాపేట జిల్లాలో గురుకుల పాఠశాల భవనానికి అద్దె చెల్లించడం లేదని యజమాని పాఠశాలకు తాళం వేశాడు. మోత్కూర్ లోని గురుకుల పాఠశాలకు భవన యజమాని తాళం వేశారు. తొమ్మిది నెలలుగా అద్దె చెల్లించడం లేదని.. ఎన్ని సార్లు అడిగినా ఎలాంటి ఉపయోగం లేదని భవన యజమాని తెలిపారు. గేటుకు తాళం ఉండటంతో ఉపాధ్యాయులు, పిల్లలు గేటు బయట పడిగాపులు కాస్తున్నారు.
హుజూర్ నగర్ లో కూడా..
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లోని గురుకుల పాఠశాలకు కూడా బిల్డింగ్ యజమాని తాళం వేశారు. ఏడాదిగా కిరాయి ఇవ్వడం లేదని.. ఇప్పటికి చాలా సార్లు ప్రైవేట్ భవన యాజమాన్యం సంఘం ఆధ్వర్యంలో ఉన్నతాధికారులకు వినతి పత్రం ఇచ్చినా ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ అద్దె బకాయిలను చెల్లించిన తరువాతనే తాళాలు తీస్తామని చెబుతున్నారు. పాఠశాల గేటుకు తాళం వేయడంతో చెట్ల కింద ఉపాధ్యాయులు కూర్చున్నారు.