కొడంగల్‌లో కాంగ్రెస్‌పై వ్యతిరేకత మొదలైంది : కేటీఆర్

కొడంగల్‌లో కాంగ్రెస్‌పై వ్యతిరేకత మొదలైంది : కేటీఆర్
  • బీఆర్‌‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్‌లో కాంగ్రెస్ సర్కార్‌‌పై తిరుగుబాటు మొదలైందని బీఆర్‌‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కొడంగల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీపీ దయాకర్ రెడ్డితోపాటు బీఎస్పీ తరఫున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన నర్మద శనివారం హైదరాబాద్ లోని నందినగర్ లో కేటీఆర్ నివాసంలో ఆయన సమక్షంలో బీఆర్ఎస్​ కండువా కప్పుకున్నారు.

 అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫార్మా సిటీని వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి.. అధికారంలోకి వచ్చాక కొడంగల్​లోనే ఫార్మా కంపెనీ ఏర్పాటుకు రంగం సిద్ధం చేయడంతో స్థానిక ప్రజలు తరిమికొట్టే పరిస్థితి ఏర్పడిందన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా కొడంగల్ నియోజకవర్గాన్ని తక్కువ ఖర్చుతో సస్యశ్యామలం చేసే ప్రణాళికలు పక్కనపెట్టి, కేవలం కమీషన్ల కోసం కొడంగల్ లిఫ్ట్ ప్రాజెక్టును చేపట్టారని మండిపడ్డారు. 

మొన్నటిదాకా రేవంత్ రెడ్డి తిట్టిపోసిన మేఘా ఇంజినీరింగ్ కంపెనీకి,  మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కంపెనీకి కాంట్రాక్టు కట్టబెట్టడం వెనుక ఉన్న మతలబు ఏంటో అర్థం చేసుకోవాలన్నారు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు అనేక వర్గాల ధర్నాలు, రాస్తారోకోలతో తెలంగాణ అట్టడుకుతుంటే.. మంత్రులు విహార యాత్రల్లో ఎంజాయ్ చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఉద్యమం నాటి పరిస్థితులు ఏర్పడ్డాయని, మళ్లీ కాంగ్రెస్ పార్టీనే శత్రువు అని అన్నారు. ఇప్పుడు కూడా ప్రజల పక్షాన బీఆర్‌‌ఎస్ పార్టీనే ఉందన్నారు.