
- ఆయన స్థాయిలో సీఎం రేవంత్ ఆవగింజంత కూడా కాదు: కేటీఆర్
- కాంగ్రెసోళ్ల పిచ్చికూతలు వినొద్దనే కేసీఆర్ అసెంబ్లీకి వస్తలేరు
- ఆయన రావొద్దనేదే నా అభిప్రాయం.. బడ్జెట్ సెషన్‌కు మాత్రం వస్తరు
- ఢిల్లీలో రేవంత్ మాట చెల్తలేదు.. తన వాళ్లకు పదవులు దక్కుతలేవ్
- కాంగ్రెస్‌లో బీజేపీ కోవర్టులు ఉన్నారన్న రాహుల్ కామెంట్లు రేవంత్‌ను ఉద్దేశించే..
- రేవంత్ చుట్టూ నలుగురు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు చేరారు
- వేల కోట్ల కుంభకోణానికి తెరదీశారని ఆరోపణ
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీలో ఎవరూ కేసీఆర్ స్థాయికి సరిపోరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ‘‘కేసీఆర్ స్థాయి కాంగ్రెస్‌లో ఎవరికీ లేదు. కేసీఆర్ స్థాయిలో రేవంత్ రెడ్డి ఆవగింజంత కూడా కాదు. కాంగ్రెసోళ్లు మాట్లాడే పిచ్చి, పనికిమాలిన మాటలు, కారుకూతలు వినకూడదనే కేసీఆర్అసెంబ్లీకి రావడం లేదు. ఆ పిచ్చి, పనికిమాలిన మాటలు వినడానికి కేసీఆర్ అసెంబ్లీకి రావొద్దనేదే ఒక కొడుకుగా, పార్టీ ఎమ్మెల్యేగా నా అభిప్రాయం” అని చెప్పారు. అసెంబ్లీ బడ్జెట్‌సమావేశాలకు మాత్రం కేసీఆర్ హాజరవుతారని తెలిపారు. బుధవారం గవర్నర్ ప్రసంగానికి, ఆ తర్వాత కొన్ని కార్యక్రమాలకు కూడా వస్తారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్నామినేషన్ సందర్భంగా సోమవారం అసెంబ్లీకి వచ్చిన కేటీఆర్.. బీఆర్ఎస్ఎల్పీలో మీడియాతో చిట్చాట్చేశారు. విద్యావంతుడు, ఉద్యమకారుడు, బీసీ బిడ్డ అయిన దాసోజు శ్రవణ్‌కు కేసీఆర్ పట్టుబట్టి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారని ఆయన చెప్పారు. గతంలో బీజేపీ అడ్డుకున్నా, రెండోసారి అవకాశం ఇచ్చి కేసీఆర్మాట నిలబెట్టుకున్నారని తెలిపారు. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు చెంపపెట్టు లాంటివని అన్నారు. ఎమ్మెల్యేల బేరసారాలకు అవకాశం ఇవ్వకూడదన్న ఉద్దేశంతోనే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ తరఫున మరో అభ్యర్థిని బరిలో నిలపడం లేదని చెప్పారు. గతంలో కాంగ్రెస్ చేసినట్టుగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి పదవులు దక్కించుకోవాలనే దుర్మార్గపు ఆలోచన తమకు లేదన్నారు. అందుకే ప్రస్తుతం తమకు సభలో ఉన్న బలం మేరకు ఒక్క అభ్యర్థినే నిలిపామని తెలిపారు.
రేవంత్, కిషన్ రెడ్డి ఒక్కటే..
కాంగ్రెస్‌లో బీజేపీ కోవర్టులు ఉన్నారంటూ రాహుల్‌గాంధీ చేసిన కామెంట్లు.. రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి చేసినవేనని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డి మాట ఢిల్లీలో నడవట్లేదని అన్నారు. ఎక్కే విమానం.. దిగే విమానం తప్ప రేవంత్చేసేదేమీ లేదని విమర్శించారు. ‘‘రేవంత్ చెప్పిన ఎవరికీ ఎమ్మెల్సీ ఇవ్వలేదు. తన సొంత వ్యక్తులకు పదవులు ఇప్పించుకోలేని నిస్సహాయ స్థితిలో ఆయన ఉన్నారు. సీఎం పీఠం రేవంత్‌దే అయినా.. పెత్తనం మొత్తం కాంగ్రెస్హైకమాండ్దే. రేవంత్‌ను చూస్తుంటే జాలేస్తున్నది” అని అన్నారు. ‘‘కేంద్ర బడ్జెట్ తర్వాత 11 ప్రతిపాదనలు పట్టుకొని ప్రధాని మోదీని రేవంత్ కలిశారు. కానీ ఆ మీటింగ్ అసలు ఎజెండా వేరే ఉంది. మంత్రి శ్రీధర్ బాబుని బయటకు పంపించి మోదీతో రేవంత్ ఏం మాట్లాడారో బయటపెట్టాలి. 15 నెలలుగా బీజేపీతో కలిసి పని చేస్తున్న రేవంత్ తెలంగాణకు తెచ్చిందేమిటో చెప్పాలి. ప్రభుత్వం ఏర్పడి 16 నెలలవుతున్నా పూర్తిస్థాయి మంత్రివర్గం లేకుండా పోయింది. ఢిల్లీలో ఏం నడవకున్నా రేవంత్మాత్రం డబ్బులు బాగానే సంపాదిస్తున్నారు” అని ఆరోపించారు. ‘‘మోదీ మంచోడు అని అనకుంటే జైల్లో వేస్తారు. కిషన్‌రెడ్డి ఆ విషయంలో నిస్సహాయుడు. రేవంత్, కిషన్ రెడ్డి ఒకే తాను ముక్కలు. ఇద్దరూ కలిసి దొంగాట ఆడుతున్నారు” అని మండిపడ్డారు.
బీసీ రిజర్వేషన్లపై రేవంత్ఆమరణ దీక్ష చేయాలి
బీసీ రిజర్వేషన్లపైన చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఆమరణ నిరాహారదీక్ష చేయాలని కేటీఆర్సవాల్విసిరారు. రేవంత్ రెడ్డి దీక్ష నుంచి పారిపోకుండా తెలంగాణ బిడ్డలు అంతా కాపలాగా ఉంటారన్నారు. ‘‘ఎన్నికల్లో సీట్ల కేటాయింపు నుంచి మొదలుకొని డిక్లరేషన్ల అమలుదాకా అన్నింట్లో బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంది కాంగ్రెస్ పార్టీనే. బీజేపీ, కాంగ్రెస్‌లకు బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉంటే రాజ్యాంగ సవరణ అత్యంత సులభం. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో బీజేపీకి ఒరిగింది శూన్యం. బీజేపీ సోషల్‌మీడియాలో ఎక్కువ.. సొసైటీలో తక్కువగా ఉంటుంది. మా పార్టీ తీసుకున్న నిర్ణయం మేరకే గ్రాడ్యుయేట్, టీచర్ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. అదే సమయానికి స్థానిక సంస్థల ఎన్నికలు, 10 స్థానాల్లో ఉప ఎన్నికలు వస్తాయి కాబట్టి వాటిపైన ఎక్కువ దృష్టి పెట్టాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు పోవడానికి భయపడి వాయిదా వేసుకుని పారిపోయింది. ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కోసం ప్రచారం చేసిన ఏకైక బలహీనమైన సీఎం రేవంత్ రెడ్డి” అని విమర్శించారు.
బడ్జెట్ సమావేశాల్లో ఏముండదు..
బడ్జెట్ సమావేశాల్లో ఏముండదని.. అవే అబద్ధాలు, అటెన్షన్డైవర్షన్లు తప్ప ప్రజలకు ఒరిగేదేమీ ఉండదని కేటీఆర్‌విమర్శించారు. పెట్టేది డొల్ల బడ్జెట్ అని, రాబోయే 15 రోజుల్లో మరోసారి ఫార్ములా ఈ–రేస్కేసును తెరపైకి తీసుకొచ్చి అటెన్షన్ డైవర్షన్ చేయబోతున్నారని చెప్పారు. ‘‘నా తెలంగాణ తర్వాత దేశంలో ఏదైనా రాష్ట్రం అభివృద్ధి చెందాలని అనుకుంటే అది ఏపీ మాత్రమే. తెలంగాణ పరిశ్రమలు ఏపీకి తరలిపోతున్నాయన్న ఉద్దేశంతోనే ఆవేదన వ్యక్తం చేశాను. ఏపీ అభివృద్ధి చెందితే సంతోష పడతాం. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ వెనుక పడుతున్నదని బాధ కలుగుతున్నది. చంద్రబాబు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనాన్ని ప్రశంసించారు. అయినా రేవంత్ రెడ్డికి కాళేశ్వరం అంశంలో సిగ్గు రావడం లేదు” అని అన్నారు.
ఎఫ్ఎస్ఐ తీసుకొచ్చేందుకు కుట్ర..
రేవంత్వెనుక నలుగురు రియల్ఎస్టేట్బ్రోకర్లు ఉన్నారని కేటీఆర్ ఆరోపించారు. ఫ్లోర్స్పేస్ఇండెక్స్ (ఎఫ్ఎస్ఐ) తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. వేల కోట్ల కుంభకోణానికి సీఎం రేవంత్, నలుగురు బ్రోకర్లు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై రేవంత్శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ‘‘మా హయాంలో విచ్చలవిడిగా భవన అనుమతులు ఇవ్వలేదు. ఎఫ్ఎస్ఐ తీసుకొచ్చింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి. టీడీఆర్విషయంలో భారీ లూటీ జరుగుతున్నది. తక్కువ రేటుకి టీడీఆర్‌లు కొని.. ఎఫ్ఎస్ఐపై నిబంధనలు విధించి భారీ రేటుకు అమ్ముకోవాలని ఎత్తుగడలు వేస్తున్నారు. ఇది ముమ్మాటికీ ఇన్సైడర్ ట్రేడింగ్ లాంటి భారీ నేరమే. దీనిపై సీబీఐ, ఈడీ వంటి సంస్థలు విచారించాలి. ప్రస్తుతం హైదరాబాద్‌లో టీడీఆర్‌లు ఎవరి వద్ద పోగుపడుతున్నాయో? ఎవరు అడ్డగోలుగా కొనుగోలు చేశారనే అంశంపై శ్వేతపత్రం విడుదల చేయాలి. ఈ టీడీఆర్ పద్ధతిలోనే వేలకోట్ల రూపాయల విలువైన 400 ఎకరాల భూములను ప్రజా అవసరాల కోసం జీహెచ్ఎంసీ ప్రజల నుంచే సేకరించింది” అని తెలిపారు.
దాసోజు నామినేషన్..
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ నామినేషన్ దాఖలు చేశారు. రెండు సెట్ల నామినేషన్ పత్రాలను సోమవారం ఆయన అసెంబ్లీలో రిటర్నింగ్ఆఫీసర్కు అందజేశారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.