బీఆర్​ఎస్​ జంగ్ ​సైరన్​తో సీఎంకు ముచ్చెమటలు : కేటీఆర్​

బీఆర్​ఎస్​ జంగ్ ​సైరన్​తో సీఎంకు ముచ్చెమటలు : కేటీఆర్​

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్​ప్రభుత్వ అసమర్థ, అనాలోచిత విధానాలపై ప్రజల కోసం గల్లీ నుంచి ఢిల్లీ దాకా బీఆర్ఎస్​ శ్రేణులు మోగించిన జంగ్​ సైరన్.. సీఎంకు ముచ్చెమటలు పట్టించిందని బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ అన్నారు. ఏడాది నుంచి కాంగ్రెస్​ నియంతృత్వ పాలనపై గులాబీ సైనికులు కనబరిచిన పోరాట స్ఫూర్తికి పేరుపేరునా శిరస్సు వంచి సలాం చేస్తున్నానని పేర్కొన్నారు. గురువారం ఆయన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ట్వీట్​ చేశారు. గెలుపోటములతో సంబంధం లేకుండా కార్యకర్తలు చూపించిన కదనోత్సాహం రాష్ట్రస్థాయి నాయకత్వంలోనూ కొండంత స్ఫూర్తి నింపిందని చెప్పారు. 

అబద్ధాల పునాదులపై అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్​ పార్టీ తుగ్లక్​ పాలనను అందిస్తున్నదని విమర్శించారు. బీఆర్ఎస్​ కార్యకర్తల అలుపెరుగని పోరాటం వల్లే అదానీ ఆశజూపిన రూ.వంద కోట్లను ప్రభుత్వం వెనక్కు ఇచ్చేసిందని చెప్పారు. లగచర్ల లడాయి నియంతృత్వ కాంగ్రెస్​ పార్టీని దేశం ముందు దోషిగా నిలబెట్టిందన్నారు. ప్రభుత్వం అక్రమకేసులు పెట్టినా.. వేధించాలని చూసినా మొక్కవోని ధైర్యంతో నిలబడ్డారని ఆయన పేర్కొన్నారు. అలాగే, ఖేల్​ రత్న, అర్జున అవార్డులకు ఎంపికైన క్రీడాకారులు తెలంగాణ బిడ్డ, పారా అథ్లెట్​ దీప్తి జివాంజి, ఏపీ అథ్లెట్​ జ్యోతి యర్రాజిలకు కేటీఆర్​ శుభాకాంక్షలు తెలిపారు.