బీఆర్​ఎస్​ అధికారంలోకి రాగానే రాజీవ్ విగ్రహాన్ని తొలగిస్తాం : కేటీఆర్

బీఆర్​ఎస్​ అధికారంలోకి రాగానే రాజీవ్ విగ్రహాన్ని తొలగిస్తాం :  కేటీఆర్
  • మేం అధికారంలోకి రాగానే గాంధీభవన్​కు తరలిస్తాం
  • రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్​ చేస్తున్నారు
  • ఇకనైనా పాలన మీద దృష్టిపెట్టాలి 
  • హామీల అమలుకు ప్రధాన ప్రతిపక్షంగా వెంటపడుతామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ తల్లి విగ్రహం ఉండాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టారని.. బీఆర్ఎస్​ అధికారంలోకి వచ్చిన తర్వాత సకల మర్యాదలతో ఆ విగ్రహాన్ని గాంధీ భవన్ కు తరలిస్తామని బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​అన్నారు. రాష్ట్రంలో పాలన పడకేసిందని.. సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇకనైనా పాలన మీద దృష్టి పెట్టాలని కోరారు. మంగళవారం తెలంగాణ భవన్ లో జాతీయ సమైక్యత దినోత్సవం పేరుతో  నిర్వహించిన కార్యక్రమంలో ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. 

ఈ సందర్భంగా కేటీఆర్​ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలన్నీ అమలు చేసేలా ప్రధాన ప్రతిపక్షంగా వెంటపడుతామన్నారు. ‘‘రేవంత్ రెడ్డి చేసిన తప్పుకు నిరసనగా తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేస్తామంటే అడ్డుకుంటారా?  పోలీసులు అత్యుత్సాహాన్ని మానుకొని అరెస్ట్ చేసిన విద్యార్థి నేతలను వెంటనే విడుదల చేయాలి”అని కేటీఆర్​డిమాండ్​ చేశారు. తెలంగాణ చరిత్ర తెలియని కొంతమంది సెప్టెంబర్ 17ను రాజకీయాల కోసం వక్రీకరించారని ఆయన దుయ్యబట్టారు. 

హామీలన్నీ అమలు చేయాలి

రేవంత్ రెడ్డి మాట్లాడిన పనికి మాలిన మాటలను తెలంగాణ సమాజం అసహ్యించుకుంటోందని, నోరు ఉంది కదా అని కేసీఆర్ ని దూషించడమే పనిగా పెట్టుకొని 9 నెలలు టైమ్ పాస్ చేశారని కేటీఆర్​విమర్శించారు. చేతనైతే కాంగ్రెస్​ ఇచ్చిన 420 హామీలను అమలు చేసి చూపెట్టాలని డిమాండ్​ చేశారు.