సింగరేణి కార్మికులను ప్రభుత్వం మోసం చేస్తున్నది : కేటీఆర్

సింగరేణి కార్మికులను  ప్రభుత్వం మోసం చేస్తున్నది : కేటీఆర్

 బీఆర్ఎస్​వర్కింగ్ ప్రెసిడెంట్​ కేటీఆర్ ఆరోపణ 

హైదరాబాద్, వెలుగు: సింగరేణి కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తున్నదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. లాభాల వాటాలో 33% బోనస్ ఇవ్వాల్సి ఉండగా, 16.9% మాత్రమే ఇచ్చారని అన్నారు.  ఆదివారం తెలంగాణ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. సింగరేణి లాభాలు రూ.4,701 కోట్లు అని ప్రభుత్వమే చెప్పిందని, అందులో 33% అంటే రూ.1,551 కోట్లు కార్మికులకు ఇవ్వాల్సి ఉండగా, రూ.796 కోట్లు మాత్రమే ఇచ్చారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ కుట్రపూరిత వైఖరిపై ఏఐటీయూసీ, సీపీఐ నేత, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కూడా సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

 సింగరేణి కార్మికులు దీనిపై పోరాడకపోతే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సింగరేణిని ప్రైవేటుపరం చేస్తాయని అన్నారు. కాగా, అమృత్ టెండర్లలో తప్పు జరిగిందా? లేదా? అని తేల్చడానికి తాను ఎక్కడికైనా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని కేటీఆర్ ప్రకటించారు. సీఎం, మంత్రులు, అధికారులు కూడా రావాలని అన్నారు. దమ్ముంటే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన సవాల్‌ను స్వీకరించాలని కేటీఆర్ డిమాండ్​చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే వచ్చే వారం తానే ఢిల్లీకి వెళ్లి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తానని చెప్పారు.