హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డికి ఏమీ తెల్వదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. పది నెలల్లో 25 సార్లు ఢిల్లీకి వెళ్లొచ్చారని, అంతకుమించి ఆయన చేసిందేమీ లేదని అన్నారు. తెలంగాణ భవన్‌లో గురువారం జరిగిన బీఆర్‌ఎస్‌వీ ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘తెలంగాణ ఉద్యమంలో చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డిలాంటి ఉద్దండులతో కొట్లాడినం.
వాళ్లతో పోలిస్తే రేవంత్ రెడ్డి ఎంత..? బీఆర్‌ఎస్ అధికారంలో లేకపోయినా.. ప్రజలకు కష్టమొస్తే తెలంగాణ భవన్‌కు వస్తున్నరు. రేవంత్ పాలనా వైఫల్యాలను బీఆర్ఎస్ నేతలు ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలి. ప్రశ్నించకపోతే తెలంగాణ మూగబోతది. కాంగ్రెస్ వాళ్లు ఏం చేసినా బీజేపీ వాళ్లు మాట్లాడటం లేదు. రాష్ట్రానికి బీజేపీ ఎంతో ప్రమాదకరమైన పార్టీ. మతాన్ని అడ్డం పెట్టుకుని రెచ్చగొడ్తది’’అని కేటీఆర్ ఆరోపించారు.
మూసీ బాధితులకు అండగా ఉంటాం
మూసీ బాధితులకు అండగా ఉంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణ భవన్‌లో మూసీ బాధితులు కేటీఆర్‌ను కలిశారు. ‘‘లీగల్‌గా ఫైట్ చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ హెల్ప్ చేస్తది. ఏ సమస్య వచ్చినా సరే లోకల్ బీఆర్ఎస్ లీడర్లను కలవండి. ప్రజాప్రతినిధులను కూడా నిలదీయండి. మూసీ ప్రాజెక్ట్‌పై రేవంత్ అర్థరహితంగా మాట్లాడుతున్నరు. మూసి ప్రక్షాళనకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలపై శుక్రవారం ప్రజెంటేషన్ ఇస్తాను’’అని కేటీఆర్ తెలిపారు.