- వీళ్ల నాటకాలు ఎన్ని రోజులో చూస్తం.. నేను అంత మంచోన్నేం కాదు
- అతి చేస్తున్న కలెక్టర్లు, పోలీసులు, అధికారులకు వడ్డీతో సహా చెల్లిస్త
- రేవంత్ రెడ్డి తాత దిగొచ్చినా వెంట్రుక కూడా పీకలేరంటూ కామెంట్లు
రాజన్న సిరిసిల్ల, వెలుగు: సిరిసిల్ల కలెక్టర్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నోరుపారేసుకున్నారు. ఆయన సన్నాసి అంటూ తిట్లపురాణం అందుకున్నారు. మంగళవారం సిరిసిల్లలోని బీఆర్ఎస్ భవన్ లో మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా సిరిసిల్ల కలెక్టర్‌పై కామెంట్లు చేశారు. ‘‘ఒక కాంగ్రెస్ కార్యకర్త వచ్చి కలెక్టర్రూపంలో కూసున్నడు.. గిసొంటి సన్నాసులను తీసుకొచ్చి కక్షపూరితంగా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నరు.. అయినా ఫరక్పడది.. బీఆర్ఎస్ వెంట్రుక కూడా ఎవడు పీకలేడు’’ అంటూ కలెక్టర్ పై విరుచుకుపడ్డారు. ‘‘ఆయన (కలెక్టర్) మన నాయకులను సీదా మాట్లాడుతుండట.. మీరు పార్టీ మారండని చెప్తుండట.. గంత గొప్పోడున్నడు ఇక్కడి కలెక్టర్. ఎన్ని రోజులు ఈ కలెక్టర్లు, పోలీసులు, అధికారుల నాటకాలు.. మనం కూడా చూద్దాం.. నేను అంత మంచోన్నేం కాదు.. ఎవరెవరైతే అతి చేస్తున్నరో, కాంగ్రెస్ కర్యకర్తల్లా పని చేస్తున్నరో.. వారికి వడ్డీతో సహా ఇస్త. రేవంత్‌రెడ్డి కాదు.. వాని తాత వచ్చినా, జేజమ్మ వచ్చినా సిరిసిల్లలో మీ వెంట్రుక కూడా పీకలేరు” అని అన్నారు.
ఆర్ఎస్ బ్రదర్స్ లా రేవంత్, సంజయ్
తెలంగాణలో రేవంత్ రెడ్డి, బండి సంజయ్.. ఆర్ఎస్ బ్రదర్స్ లా ఉంటున్నారని కేటీఆర్ విమర్శించారు. బీజేపీ నాయకత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రక్షణ కవచంలా ఉందని, రేవంత్ మీద ఈగ వాలనీయకుండా కంటికి రెప్పలాగా సంజయ్ కాపాడతున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి అభిమాన సంఘం అధ్యక్షుడు ఎవరంటే బండి సంజయ్అని ఎద్దేవా చేశారు. ‘‘హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూలగొడుతుంటే రేవంత్ మంచి పని చేస్తున్నడని రఘునందన్ రావు కితాబిచ్చారు. సంజయ్ ను కరీంనగర్ ఎంపీగా గెలిపించేందుకు రేవంత్ ఓ డమ్మీ క్యాండిడేట్ ను పెట్టారు. రేవంత్ తానా అంటే బీజేపీ తందాన అంటున్నది. ఈ రెండు పార్టీల భరతం పట్టాలి” అని అన్నారు. ‘‘రాష్ట్రంలోనే ఎక్కువ మంది పవర్ లూమ్ కార్మికులు సిరిసిల్లలో ఉంటే, యార్న్బ్యాంక్ ను వేములవాడలో పెట్టారు. పుండు ఒక చోటుంటే మందోచోట పెట్టినట్టుంది కాంగ్రెసోళ్ల తెలివి” అని విమర్శించారు. కేసీఆర్ పై ప్రజలకు అమితమైన ప్రేమ ఉందని, ఇప్పటికిప్పుడు ఎన్నికలొచ్చినా బీఆర్ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 29న కరీంనగర్ లో నిర్వహించే ‘దీక్షా దివస్’ను సక్సెస్ చేయాలని పార్టీ క్యాడర్‌కు పిలుపునిచ్చారు.
కేసీఆర్ మహావృక్షం..
కేసీఆర్ మహావృక్షం అని కేటీఆర్ అన్నారు. ‘‘కేసీఆర్ అనే మొక్కను మొలువనియ్య అని రేవంత్ మాట్లాడుతుండు. కేసీఆర్ మొక్క కాదు పాలమూరు జిల్లాలోని ఊడల మర్రి వంటి మహావృక్షం. ఊడల మర్రి ఎంత గొప్పదో కేసీఆర్ అంత గొప్పోడు. ఈ విషయం చిల్లర వెధవలకు అర్థం కాదు. కేసీఆర్ ను ఫినిష్ చేస్తామని చెప్పిన నాయకులు ఇయ్యాల్ల హైద్రాబాద్ లో ఒక్కడు లేడు. రేవంత్ ను చూసుకుని ఎగిరెగిరి పడుతున్న కాంగ్రెస్ నాయకులు.. అధికారులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తామంటే ఊరుకోం” అని హెచ్చరించారు. ‘‘రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో గొడవలు జరుగుతున్నా పట్టించుకున్న నాయకుడే లేడు. భూసేకరణను ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. కలెక్టర్, అధికారులు బహిరంగ విచారణ చేపడితే ప్రజలు నిరసన తెలుపుతూ ఉరికిచ్చారు. అదే రేవంత్ రెడ్డి పోయి ఉంటే ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టెటోళ్లు” అని అన్నారు. రేవంత్ రెడ్డి బ్రదర్ తిరుపతి రెడ్డి గూండాయిజం చేస్తున్నాడని మండిపడ్డారు.