* ఫార్ములా ఈ లొట్టపీసు కేసు
* నాపై కేసు పెడితే రేవంత్ మీద కూడా పెట్టాలె
* అవినీతే లేనప్పుడు కేసు ఎక్కడిది..?
* అధికారం ఇవ్వకపోతే రెస్టు తీసుకుంటానని అప్పుడే చెప్పిండు
* ప్రస్తుతం ఆయన రెస్టులో ఉన్నాడు
* అగ్రిమెంట్ నేను చేసిన.. ఆయన క్యాన్సిల్ చేసిండు
* ట్రిపుల్ ఆర్ లో 12 వేల కోట్ల కుంభకోణానికి కోమటిరెడ్డి ప్లాన్
* ఏప్రిల్ 25న హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ పెడ్తం
* ఈ ఏడాది అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు రావచ్చు
* చిట్చాట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్: ఫార్ములా ఈ ఓ లొట్టపీసు కేసు అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. అసలు అవినీతే లేనప్పుడు కేసు ఎక్కడిదని అన్నారు. ఒప్పందం చేసుకున్నందుకు తనపై కేసు పెడితే రద్దు చేసిన రేవంత్ పైనా పెట్టాలని అన్నారు. ఇవాళ ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో చిట్ చాట్ చేశారు. ఫార్ములా ఈ కేసులో పసే లేదన్నారు. ‘ఫోన్ ట్యాపింగ్ కేసు అన్నారు. డ్రగ్స్, లగచర్ల.. ఇప్పుడు కార్ రేస్ కేసు అంటున్నరు’ ఎన్ని కేసులు పెట్టినా భయపడబోనని కేటీఆర్ చెప్పారు.
‘హైదరాబాద్ ఇమేజ్ కోసం ఈ రేస్ లో డబ్భులు పంపుమన్న..మంత్రిగా విధానపరమైన నిర్ణయం తీసుకున్న.. అధికారులు ఫైల్స్ చూస్తారు.. నాకేం సంబంధం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫార్ములా ఈ రేస్ ను రద్దు చేసిండు.. క్యాబినెట్ లో నిర్ణయం తీసుకొనే చేసిండా..? రేవంత్ రెడ్డి కారణంగా 600 కోట్లు నష్టం జరిగింది. నా మీద కేసు పెడితే ఆయన మీద కూడా పెట్టాలె కదా..? ఫార్ములా ఈ కేసులో అవినీతే లేనప్పడు.. కేసు ఎక్కడిది..? మాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది.’అని కేటీఆర్ అన్నారు.
కేసిఆర్ మా ట్రంప్ కార్డు
ఎప్పుడు బయటికి రావాలో కేసీఆర్ కు తెలుసు.. ఆయన మా ట్రంప్ కార్డు.. మీరు అధికారం ఇవ్వకపోతే రెస్టు తీసుకుంటానని ఎలక్షన్ల టైంలోనే చెప్పిండు.. అధికారం ఇవ్వలేదు.. అందుకే రెస్టు తీసుకుంటుండు.. ఇక్కడ సమస్య కేసీఆర్ గురించి కాదు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీల గురించి.. మీరిచ్చిన హామీలను ముందు అమలు చేయండి..
త్వరలో ఉప ఎన్నికలు
పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టుకు వెళ్లబోతున్నామని, త్వరలోనే ఆ సెగ్మెంట్లో ఉప ఎన్నికలు జరుగుతాయని కేటీఆర్ చెప్పారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం రోజైన ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నామని చెప్పారు.
అక్టోబర్ లో బీఆర్ఎస్ అధ్యక్ష ఎన్నిక
ఏడాది మొదటి హాఫ్ లో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. తర్వాత గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు వేస్తామని తెలిపారు. పార్టీ అధ్యక్షుడి ఎన్నికకు వచ్చే అక్టోబర్ వరకు సమయముందని అన్నారు. పార్టీ నేతలకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చూపిస్తామని చెప్పారు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేదని, ప్రభుత్వమే కోర్టుల్లో కేసులు వేయించబోతోందని అన్నారు. బీసీలను మోసం చేసే ఈ ప్రభుత్వాన్ని వెంటాడుతామని కేటీఆర్ అన్నారు.
ట్రిపుల్ ఆర్ లో 12 వేల కోట్లు కొట్టేసే ప్లాన్
రీజినల్ రింగ్ రోడ్డులో 12 వేల కోట్లను కొట్టేసేందుకు ప్లాన్ జరుగుతోందని, ఇందులో మంత్రి కోమటిరెడ్డి ఉన్నారని అన్నారు. ఈ యేడాది కాలంలో రేవంత్ రెడ్డి చేసిన లక్షా 37 వేల కోట్లు అప్పుల్లో డిల్లీకి చాలా డబ్భులు పోయాయని ఆరోపించారు.