- సీఎంకు దమ్ముంటే పర్మిషన్ ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలి: కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: హైడ్రా పేరుతో పేదల బతుకులను సీఎం రేవంత్‌రెడ్డి రోడ్డున పడేస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రేవంత్‌కు దమ్ముంటే బఫర్‌లో జోన్‌లో, ఎఫ్‌టీఎల్ పరిధిలో ఇండ్లకు పర్మిషన్ ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. హైడ్రా విషయంలో తన అన్న తిరుపతిరెడ్డికి ఒక న్యాయం, గరీబోళ్లకు ఒక న్యాయమా? అని ఆయన ప్రశ్నించారు. పేదల ఇండ్లను నిర్దాక్షిణ్యంగా కూలగొడుతున్న హైడ్రా.. తిరుపతిరెడ్డి ఇంటిని ఎందుకు కూల్చడం లేదో చెప్పాలన్నారు. ఈ మేరకు శేరిలింగంపల్లి కార్యకర్తలు, పార్టీ నాయకులతో మంగళవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదవాళ్ల ఇండ్లను కూల్చేస్తామంటే బీఆర్ఎస్ ఊరుకోదన్నారు.
సంజయ్ కేంద్ర మంత్రినని మర్చిపోయినట్టున్నడు..
అమృత్ స్కీమ్ టెండర్ల విష యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యవహారం దొంగలుపడ్డ ఆర్నెళ్లకు కుక్కలు మొరిగినట్టు ఉందని కేటీఆర్ విమర్శించారు. అమృత్ పథకం టెండర్ల కేటాయింపులో అవినీతి జరిగిందని అందరికంటే ముందు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి బయటపెట్టారని.. అయినా సంజయ్ పట్టించుకోలేదని కేటీఆర్ ఆరోపించారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ)కు సంజయ్ సిఫార్సులు అవసరం లేదన్నారు. కేంద్ర మంత్రినన్న విషయాన్ని సంజయ్ మర్చిపోయినట్టు ఉన్నాడని ఆయన ఎద్దేవా చేశారు.