కమీషన్ల కోసమే మూసీ సుందరీకరణ : కేటీఆర్

కమీషన్ల కోసమే మూసీ సుందరీకరణ : కేటీఆర్
  • రాహుల్, వాద్రాతో కలిసి డబ్బులు పంచుకునే ప్లాన్
  • ఎన్నికల హామీలడిగితే పైసల్లేవంటున్నరు
  • మూసీకి రూ.1.50 లక్షల కోట్లు ఎక్కడివి?
  • నా చెల్లెను జైల్లో పెట్టినా..మోదీకి భయపడలేదని కామెంట్

హైదరాబాద్, వెలుగు: కమీషన్ల కోసమే మూసీ సుందరీకరణ చేపడ్తున్నారని బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌‌‌‌ గాంధీ, ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా కలిసి మూసీ మీద వచ్చే కమీషన్లను పంచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ భవన్‌‌‌‌లో బుధవారం కాంగ్రెస్ నేత మహ్మద్ అల్లావుద్దీన్ పటేల్ కేటీఆర్ సమక్షంలో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. ‘‘ఈ సారి ఎవరూ పండుగ జరుపుకునే పరిస్థితి లేకుండా భయానకవాతావరణం సృష్టించారు.

కేసీఆర్ సీఎంగా ఉండి ఉంటే ఇప్పటికే రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు పడేవి. ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు వచ్చేవి. తెలంగాణలో యూపీ తరహా బుల్డోజర్ పాలన తీసుకొచ్చారు. కాంగ్రెస్ చేస్తున్న అఘాయిత్యాలను చూసి ప్రతి ఒక్కరూ కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను తల్చుకుంటున్నరు. అరచేతిలో వైకుంఠం చూపించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. పది నెలల పాలనలో అన్ని వర్గాలు అసంతృప్తితో ఉన్నయ్’’అని కేటీఆర్ విమర్శించారు. 

కేంద్రం, రాష్ట్రంపై పోరాడుతాం

‘‘ఎన్నికల టైమ్​లో ఇచ్చిన హామీల గురించి అడిగితే పైసలు లేవని అంటున్నరు. కానీ.. మూసీ సుందరీకరణ కోసం రూ.1.5 లక్షల కోట్లు ఖర్చు చేస్తామని అంటున్నరు. సంక్షేమ పథకాల కోసం పైసలిస్తే మీరు కమీషన్ లు ఇవ్వరు కదా? అదే మూసీ ప్రాజెక్ట్ అయితే లక్షా కోట్లు మింగొచ్చు. రాహుల్ గాంధీ, వాళ్ల బావకు (రాబర్ట్ వాద్రా) కోట్ల రూపాయలు దోచి పెట్టొచ్చు. ఇదే కాంగ్రెస్ ప్లాన్’’అని కేటీఆర్ ఆరోపించారు. మా చెల్లిని జైల్లో పెట్టినా తల వంచలేదని, మోదీతోనే పోరాటం చేశామన్నారు. అదే స్ఫూర్తి కొనసాగిస్తామని తేల్చి చెప్పారు.