మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున ఇవ్వాలి : కేటీఆర్

మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున ఇవ్వాలి : కేటీఆర్
  • బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ డిమాండ్
  • 5 లక్షలే ఇస్తామనడం అన్యాయమని వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు: వరదల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని బీఆర్‌‌‌‌‌‌ఎస్‌‌  వర్కింగ్  ప్రెసిడెంట్  కేటీఆర్  డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున మాత్రమే ఇస్తామనడం అన్యాయం అని ఆయన పేర్కొన్నారు. జీహెచ్‌‌ఎంసీకి వరదలు వచ్చినప్పుడు, మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు ఇవ్వాలని అప్పుడు పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఉన్న రేవంత్‌‌ రెడ్డి డిమాండ్  చేశారని  కేటీఆర్  గుర్తుచేశారు.

ఇప్పుడు రేవంతే సీఎంగా ఉన్నారని, రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇచ్చి మృతుల కుటుంబాలను ఆదుకోవాలని సోమవారం ట్విట్టర్ లో ఆయన కోరారు. వరదల కారణంగా ఇండ్లు కోల్పోయిన వారికి, ఇండ్లు దెబ్బతిన్నవారికి రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు సాయంచేసి ఆదుకుంటామన్న మాటను నిలబెట్టుకోవాలని సీఎంకు ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అసమర్థత, చేతగానితనం, ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లే ప్రాణనష్టం జరిగిందని ఆయన ఆరోపించారు.  

ఎస్ఎన్ డీపీ వల్లే హైదరాబాద్​కు ముప్పు తప్పింది

తాము అధికారంలో ఉన్నపుడు ముందుచూపుతో ఏర్పాటుచేసిన స్ట్రాటజిక్  నాలా  డెవలప్ మెంట్  ప్రోగ్రాం (ఎస్ఎన్​డీపీ) వల్లే హైదరాబాద్ కు వరద ముప్పు తప్పిందని మరో ట్వీట్ లో కేటీఆర్​ పేర్కొన్నారు. మూడు రోజులుగా హైదరాబాద్ లో ఎడతెరిపిలేకుండా  వర్షం కురుస్తున్నా లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురికాకుండా కాపాడడంలో ఎస్ఎన్ డీపీ కీలకపాత్ర పోషించిందన్నారు.