- మూసీ పేరు చెప్పి ప్రభుత్వం దోచుకుంటోంది: కేటీఆర్
- బ్యూటిఫికేషన్‌కు కాదు.. లూటిఫికేషన్‌కే వ్యతిరేకం
- మూసీ ప్రక్షాళనకు గతంలోనే ఎస్టీపీలు నిర్మించామని వెల్లడి
సికింద్రాబాద్, వెలుగు: కాంగ్రెస్ప్రభుత్వం మూసీ పునరుజ్జీవాన్ని ఎవరి కోసం చేస్తోందో చెప్పాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్కేటీఆర్డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓట్లు వేయలేదని, అందుకే పేద ప్రజలపై కక్ష కట్టి, మూసీ ప్రక్షాళన పేరుతో వారి ఇండ్లు కూలుస్తోందని ఆరోపించారు. నాచారంలోని సీవరేజ్ట్రీట్మెంట్ప్లాంట్ను ఆదివారం స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, నాయకులతో కలిసి కేటీఆర్ సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల ఇండ్లను కూల్చివేసి, బస్టాండ్, మెట్రో స్టేషన్ ఎలా ఉంచుతారని ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళనతో ఇండ్లను కోల్పోతున్నవారికి న్యాయపరంగా అండగా నిలుస్తామన్నారు. ఇప్పటికే 500 మందికి ఊరటనిచ్చేలా హైకోర్టులో స్టే ఆర్డర్లు వచ్చాయన్నారు. ఇండ్లు ఖాళీ చేయాలంటున్న అధికారులను నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దక్షిణాసియాలోనే మొదటగా వంద శాతం మురుగునీటిని శుద్ధి చేసిన నగరంగా హైదరాబాద్నిలిచిందని, ఇది కేసీఆర్ఘనతేనని చెప్పారు.
గతంలోనే రూ. 3,800 కోట్ల ఖర్చుతో ఎస్టీపీలను నిర్మించామని తెలిపారు. నగరంలో 57.5 కిలోమీటర్ల మేర ప్రవహించే మూసీకి పునరుజ్జీవం తేవాలంటే ముందుగా నీటిని శుద్ధి చేయాలన్నారు. ఎస్టీపీలు, బ్రిడ్జిలు, గోదావరి అనుసంధానంతో మూసీకి పునరుజ్జీవం పోసిందే బీఆర్ఎస్ అని అన్నారు. తమ పార్టీ బ్యూటిఫికేషన్‌కు వ్యతిరేకం కాదని, పేదలను రోడ్డుపై పడేసే లూటిఫికేషన్‌కే వ్యతిరేకమన్నారు. అవసరమైతే కరకట్టలు కట్టాలని.. కానీ బఫర్‌జోన్‌లోకి వెళ్లకూడదని కోరారు.
విద్యార్థులకు చెక్కుల పంపిణీ..
ఎంబీబీఎస్ చదువుతున్న వందకుపైగా మంది స్టూడెంట్ల ఫీజు కోసం ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి అందించిన చెక్కులను ఈ సందర్భంగా కేటీఆర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయడం పట్ల ఎమ్మెల్యేను కేటీఆర్ అభినందించారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, కేపీ వివేకానంద, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు తదితరులు పాల్గొన్నారు.