సోనియా, రాహుల్ ఎన్డీయే భాగస్వాములేనా!

సోనియా, రాహుల్ ఎన్డీయే భాగస్వాములేనా!
  • నేషనల్ హెరాల్డ్ కేసులో వారికీ బెయిల్ వచ్చిందిగా?: కేటీఆర్
  • కాంగ్రెస్ నేతల కామెంట్లపై ఫైర్  

హైదరాబాద్, వెలుగు:  బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటైనందునే ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చిందంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న కామెంట్లపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు పనికిమాలిన స్టేట్ మెంట్లతో రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారన్నారు. ‘‘నేషనల్ హెరాల్డ్ కేసులో 2015 డిసెంబర్ లో సోనియా గాంధీ,  రాహుల్ గాంధీకి బెయిల్ వచ్చింది.

 కాంగ్రెస్ కూడా ఎన్డీయేతో కుమ్మక్కు అయితేనే బెయిల్ వచ్చిందా?’’ అని కేటీఆర్ బుధవారం ట్విట్టర్లో ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డి 2015 నుంచి బెయిల్‌‌పై ఉన్నారన్న సంగతిని కాంగ్రెస్ నేతలు గుర్తు పెట్టుకోవాలని చెప్పారు. ఇవన్నీ కూడా ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే జరిగాయని, మరి వీరందరినీ ఎన్డీయే భాగస్వాములే అనుకోవాల్నా? అని ప్రశ్నించారు. 

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మీద సీఎం రేవంత్‌‌రెడ్డి కపట ప్రేమ ఒలకబోస్తున్నారని కేటీఆర్ దుయ్యబట్టారు. ‘‘తెలంగాణ తల్లి కోసం నిర్ణయించిన స్థలంలో కాంగ్రెస్ నాయకుల విగ్రహాలేమిటని అడిగితే కారుకూతలు కూస్తావా? తెలంగాణ ఉద్యమం గుండెల్లో గునపాలు దించిన నీ చేతులతో తెలంగాణ తల్లి విగ్రహం పెడితే అవమానమే. గాంధీ విగ్రహం గాడ్సే పెడితే ఎట్లుంటదో ఇది అట్లుంటది”అని కేటీఆర్ ఓ ప్రకటనలో హెచ్చరించారు. కాగా, రష్యా రాజధాని మాస్కోలో వచ్చే నెల 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు జరగనున్న ‘ఫెస్టివల్‌‌ ఆఫ్‌‌ ఫ్యూచర్‌‌ పోర్టల్‌‌’లో ప్రసంగించేందుకు కేటీఆర్‌‌‌‌కు ఆహ్వానం అందిందని ఆయన ఆఫీసు ఒక ప్రకటనలో తెలిపింది.