హైదరాబాద్, వెలుగు: గాంధీ ఆస్పత్రిలో మరణాలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసిన కమిటీ మతిలేనిదని విప్ బీర్ల అయిలయ్య అన్నారు. గాంధీ ఆస్పత్రిపై ప్రజలకు నమ్మకం పోయేలా కేటీఆర్, హరీశ్ రావు బిల్లా.. రంగాల్లా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. సోమవారం అసెంబ్లీలోని మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడారు. పదేండ్లు అధికారంలో ఉండి గాంధీ ఆస్పత్రి గురించి పట్టించుకోని వాళ్లు ఇప్పుడు మాట్లాడడం ఏమిటని ప్రశ్నించారు. ఉస్మానియా ఆస్పత్రి నిర్మిస్తామని చెప్పి, ప్రగతి భవన్, ఫామ్ హౌస్ కట్టుకున్నారని కేసీఆర్‌పై మండిపడ్డారు.
కేసీఆర్ అసెంబ్లీకి రాడు, ప్రతిపక్ష నేత పదవి కోసం కేటీఆర్, హరీశ్ కొట్లాడుకుంటున్నారని విమర్శించారు. మామ తనకే ఇస్తాడని అల్లుడు.. నాన్న తనకే కట్టబెడతాడని కొడుకు.. నమ్మకం పెట్టుకున్నారని అన్నారు. తెలంగాణలో విజయ డైయిరీని పదేండ్లుగా కేసీఆర్ నిర్వీర్యం చేశారని, హరీశ్ రావు తన భార్య పేరు మీద కొత్త డెయిరీ నడుపుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు విజయ డైరీ, మదర్ డైరీ సొమ్మును పందికొక్కుల్లా మెక్కారని ఆరోపించారు. ఈ రెండు డెయిరీలు నష్టాల్లో ఉండడానికి హరీశ్ రావు కారణమని, ఆయనకు పాడి రైతుల పాపం తగలక మానదన్నారు.