ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

లగచర్ల ఘటన తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ ఘటన సీఎం సొంత ఇలాకాలో జరగడం ఒక ఎత్తైతే, బీఆర్ఎస్ నేతలు కుట్ర పన్ని ఏకంగా కలెక్టర్‌పైనే దాడికి పాల్పడటం మరో ఎత్తు. ఈ కేసులో బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను అరెస్టు చేస్తారంటూ ప్రచారమూ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

ఎప్పటిలానే కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న జ్ఞానం లేకుండా 'ఎవనిదిరా కుట్ర? ఏంది ఆ కుట్ర?..' అంటూ నీచమైన భాష వాడారు.  

నన్ను అరెస్ట్ చేస్తావని ఎప్పుడో తెలుసు.. 

"ఎవనిదిరా కుట్ర?  ఏంది ఆ కుట్ర? నీకు ఓటేసిన పాపానికి వారి భూములను కాజేయాలనుకోవడం కుట్ర కాదా? నీ అల్లుని కోసమో, అన్న కోసమో…రైతన్న నోట్లో మట్టి కొట్టడం కుట్ర కాదా? గత తొమ్మిది నెలలుగా రైతుల జీవితాలను రోడ్డుకు ఈడ్వడం కుట్ర కాదా? నీ ప్రైవేట్‌‌ సైన్యంతో తండ్రిని కొడుక్కి, బిడ్డను తల్లికి, భార్యను భర్తకి దూరం చెయ్యడం ఎవరి కుట్ర? పేద లంబాడా రైతులను బూతులు తిట్టి, బెదిరించింది ఎవరి కుట్ర? ఎవని కోసం కుట్ర! మర్లపడ రైతులు, ఎదురు తిరిగిన పాపానికి నడవలేకుండా చిత్రహింసలు పెట్టింది ఎవరి కుట్ర? 50 లక్షల బ్యగులతో దొరికిన దొంగలకు, రైతు కష్టం కుట్రగా కాక ఎలా కనిపిస్తుంది?

నన్ను ఏదో ఒక కేసులో నువ్వు ఇరికించి అరెస్ట్ చేస్తావని ఎప్పుడో తెలుసు! రైతుల గొంతైనందుకు అరెస్ట్ చేస్తే గర్వంగా పోతాను! నీ కుట్రలకు భయపడేవాళ్ళు ఎవ్వరూ లేరు. చేసుకో అరెస్ట్ రేవంత్‌ రెడ్డి! చూద్దువుగాని నిజానికి ఉన్న దమ్మేంటో!!!.." అని కేటీఆర్ ముఖ్యమంత్రిని విమర్శిస్తూ ట్వీట్ చేశారు.

కాగా, ఈ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డికి కొడంగల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇదే ఘటనలో కీలక నిందితుడైన అతని అనుచరుడు బోగమోని సురేష్ పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నాడు. అతని కోసం ప్రత్యేక పోలీస్ బృందాలు ఎంత గాలిస్తున్నా.. ఆచూకీ మాత్రం తెలియరాలేదు.