ఎంపీ ఎన్నికల్లో కారు స్పీడ్ ​పెరుగుతది : కేటీఆర్​​ 

ఎంపీ ఎన్నికల్లో కారు స్పీడ్ ​పెరుగుతది : కేటీఆర్​​ 
  • బీఆర్ఎస్​ఎంపీలతోనే రాష్ట్రానికి న్యాయం
  • పొరపాట్లను సవరించుకొని.. తెలివైన ప్రతిపక్షంగా ముందుకెళ్దాం
  • చేవెళ్ల అసెంబ్లీ సెగ్మెంట్​సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వ్యాఖ్యలు

చేవెళ్ల, వెలుగు:  పద్నాలుగేండ్లు కారు ఢిల్లీ వరకు ఉరికిందని.. ప్రస్తుతం సర్వీసింగ్ కు మాత్రమే పోయిందని.. పార్లమెంట్ ఎన్నికల్లో స్పీడ్ పెంచనుందని బీఆర్ఎస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. పదేండ్లు అధికారం ఇచ్చిన ప్రజలు ఇప్పుడు ప్రతిపక్ష స్థానం ఇచ్చారని, పొరపాట్లను సవరించుకుని తెలివైన ప్రతి పక్షంగా ముందుకు పోదామని కార్యకర్తలకు కేటీఆర్​పిలుపునిచ్చారు.

సోమవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల అసెంబ్లీ సెగ్మెంట్ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ‘జనం మాకు ప్రతి పక్ష పాత్ర ఇచ్చారు. అందులో బలంగా మన వాణిని వినిపిస్తాం. 2014 నుంచి కసిగా పని చేశాం. అందర్నీ సమన్వయం చేయడంలో కొంత లోపం జరిగింది. ఇది భయంకరమైన ఓటమేం కాదు. 14 సీట్లు దగ్గరలోకి వచ్చి పడిపోయాం.  వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులనును గెలిపించాలి”అని కేటీఆర్​అన్నారు.

కాంగ్రెస్, బీజేపీలకు చెందిన డూడూ బసవన్నలను ఢిల్లీకి పంపితే తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. చేవెళ్ల ఎంపీగా రంజిత్​రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు. ప్రజలు ప్రతిపక్ష పాత్ర ఇచ్చారని, బలమైన ప్రతిపక్షంగా ప్రజల తరఫున పోరాటం చేస్తామని చెప్పారు. మార్చి17వ తేదీతో కాంగ్రెస్​ ప్రభుత్వానికి100 రోజులు పూర్తి అవుతాయని, అప్పటి లోగా ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే పోరాటం చేస్తామన్నారు. వికారాబాద్​ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్​ను అసెంబ్లీ స్పీకర్​గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి మద్దతు ఇచ్చినట్లు తెలిపారు.

బీజేపీ దేశానికి, రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. బండి సంజయ్​రంగారెడ్డి జిల్లాలో ఐటీఐఆర్ పై ఒక్క మాట మాట్లాడలేదని గుర్తు చేశారు. తెలంగాణ కోసం పార్లమెంట్ లో మాట్లాడేది బీఆర్ఎస్ నాయకులు మాత్రమే అని వివరించారు. గతంలో జరిగిన పొరపాట్లను సవరించుకుని, అన్ని బాగా చేసుకుని ఒక బలమైన, తెలివైన ప్రతి పక్షంగా ముందుకు పోదామని కార్యకర్తలకు కేటీఆర్​ పిలుపునిచ్చారు.

చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ... వచ్చే 6 నెలలు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలన్నారు. బీఆఎర్ఎస్​ గెలుపు కోసం కలిసికట్టుగా పనిచేద్దామని  ఎమ్మెల్సీ పట్నం మహేందర్​రెడ్డి అన్నారు. చేవెళ్ల సెంటిమెంట్​ను కొనసాగిద్దామని బీఆర్ఎస్​రాష్ర్ట నాయకుడు పట్లోళ్ల కార్తీక్​రెడ్డి అన్నారు. 

స్థానిక ఎమ్మెల్యే దూరం

చేవెళ్లలో నిర్వహిస్తున్న సమావేశానికి మాజీ మంత్రులు కేటీఆర్, మహేందర్ రెడ్డి, యువ నాయకుడు కార్తీక్ రెడ్డితో పాటు 5 మండలాలు చేవెళ్ల, షాబాద్, మొయినాబాద్, నవాబ్ పేట, శంకర్ పల్లి  ప్రజా ప్రతినిధులు జడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్ లు హాజరయ్యారు. కానీ చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మాత్రం రాలేదు. రెండు రోజుల క్రితమే ప్రోగ్రామ్ ఫిక్స్ చేయగా, అప్పటి నుంచే ఎమ్మెల్యే అంటి ముట్టనట్లు ఉన్నారు.

సమావేశానికి ఎందుకు రాలేదని ఆరా తీస్తే ఇంట్లో ఎమ్మెల్యే కాలుజారి పడినట్లు సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ కు పార్టీ నాయకులు సమాచారం ఇచ్చారు. నగరంలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సభలో పార్టీ శ్రేణులు ప్రకటించారు. కావాలనే ఎమ్మెల్యే రాలేదాని కొందరు గుసగుసలాడుకున్నారు.