సీఎం అంటే రాజు కాదు..పెద్ద పాలేరు:కేటీఆర్

సీఎం అంటే రాజు కాదు..పెద్ద పాలేరు:కేటీఆర్

ఆయన ప్రజల ఆస్తులకు ధర్మకర్త మాత్రమే: కేటీఆర్
ప్రజలంతా తమ బానిసలు, కాళ్ల కింద చెప్పులు అన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నది 
హెచ్‌సీయూ భూములు ఎవరూ కొనొద్దు 
మేం అధికారంలోకి వచ్చాక అవన్నీ స్వాధీనం చేస్కుంటం 
ఆ భూముల్లో ఎకో పార్క్ అభివృద్ధి చేస్తామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: హెచ్‌‌‌‌సీయూ భూములను కాపాడాలని 10 రోజులుగా విద్యార్థులు పోరాడుతున్నా.. ప్రభుత్వం వారితో కనీసం చర్చలు జరిపేందుకు కూడా ముందుకురావడం లేదని బీఆర్ఎస్​వర్కింగ్​ప్రెసిడెంట్​కేటీఆర్ మండిపడ్డారు. పైగా ఆందోళన చేస్తున్న విద్యార్థులను గుంటనక్కలు, పెయిడ్​బ్యాచ్​అని అనడం సీఎం, మంత్రుల అహంకారానికి నిదర్శనమని ఫైర్ అయ్యారు. 

‘‘సీఎం రాష్ట్రానికి నియంతనో, రాజో కాదు.. ఓ పెద్ద పాలేరు మాత్రమే. మంత్రులైనా, ఎమ్మెల్సీలైనా, ఎమ్మెల్యేలైనా అందరూ పబ్లిక్​ సర్వెంట్లే. ప్రజల సొమ్ముకు ప్రభుత్వాలు కేవలం ధర్మకర్తలే. కానీ ‘మేం పాలకులం.. మీరంతా మా కాలు కింద చెప్పులు, బానిసలు’ అన్నట్టుగా ఓ విచిత్రమైన మానసిక రోగంతో రేవంత్​ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. రోజూ 18 గంటలు పని చేస్తున్నానని చెప్పుకునే సీఎం రేవంత్​రెడ్డి.. కనీసం 10 నిమిషాలైనా మనిషిలా ఆలోచించాలి. 

ఓ పది నిమిషాలు తండ్రి, తాతలాగా భవిష్యత్​తరాల మీద సోయితో రేవంత్​ఆలోచించాలి” అని కేటీఆర్​ సూచించారు. గురువారం తెలంగాణ భవన్‌‌‌‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. హెచ్‌‌‌‌సీయూది ప్రభుత్వ భూమి అని చెబుతున్న కాంగ్రెస్​నేతలు.. అర్ధరాత్రి దొంగల్లాగా అక్కడ పనులు ఎందుకు చేయిస్తున్నారని ప్రశ్నించారు. కోర్టు సెలవులు చూసుకుని యూనివర్సిటీలో ప్రభుత్వం విధ్వంసం సృష్టిస్తున్నదని మండిపడ్డారు. శని, ఆదివారాలు ప్రజల మీదికి బుల్డోజర్లు పంపొద్దని హైకోర్టు, సుప్రీంకోర్టులు చెప్పినా ప్రభుత్వానికి బుద్ధి రాదా? అని ఫైర్ అయ్యారు. 

ఇంచు భూమి కూడా వదలం..

ఫ్యూచర్​సిటీ కోసం 14 వేల ఎకరాల భూములు రెడీగా ఉన్నాయని, అందులో ఐటీ పార్కులు ఏర్పాటు చేయకుండా.. ప్రభుత్వం హెచ్‌‌‌‌సీయూ భూములపైనే ఎందుకు పడిందని కేటీఆర్​ప్రశ్నించారు. యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాలను సీఎం రేవంత్ రెడ్డి కబ్జా పెట్టాలనుకుంటున్నారని ఆరోపించారు. ‘‘సీఎం రేవంత్​ విసిరే బిస్కెట్లకు ఆశపడి ఎవరూ ఆ భూమిని కొనొద్దు. 

మూడేండ్ల తర్వాత మేం కచ్చితంగా అధికారంలోకి వస్తాం. ఇంచు భూమిని కూడా వదలం. ఎవరైతే భూములు కొంటారో వారి దగ్గర్నుంచి మళ్లీ స్వాధీనం చేసుకుంటం. అందులో అతిపెద్ద ఎకోపార్కు ఏర్పాటు చేస్తాం. దాన్ని అమెరికా మాన్‌‌‌‌హాట్టన్‌‌‌‌లోని సెంట్రల్​పార్కులాగా అభివృద్ధి చేసి.. హైదరాబాద్​ప్రజలు, హెచ్‌‌‌‌సీయూ విద్యార్థులకు గిఫ్ట్‌‌‌‌గా ఇస్తాం” అని చెప్పారు. 

‘‘ కేసీఆర్ హయాంలో 270 కోట్ల మొక్కలు నాటి హరిత విప్లవాన్ని సృష్టించాం. దీంతో ఒక్క హైదరాబాద్‌‌‌‌లోనే 7.7 శాతం గ్రీన్​కవర్​పెరిగిందంటూ ఫారెస్ట్​సర్వే ఆఫ్​ఇండియా నివేదిక ఇచ్చింది. రాష్ట్రంలో 15 వేల నర్సరీలు ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ” అని పేర్కొన్నారు.  హెచ్‌‌‌‌సీయూ విద్యార్థులకు అండగా ఉంటామని, ఇది హైదరాబాద్​భవిష్యత్​కోసం జరుగుతున్న పోరాటమని అన్నారు. 

హెచ్‌‌‌‌సీయూపై ప్రభుత్వం దండయాత్ర

యుద్ధానికి పోయినట్టు హెచ్‌‌‌‌సీయూపై ప్రభుత్వం దండయాత్రకు వెళ్లిందని కేటీఆర్ అన్నారు. ‘‘రోహిత్ వేముల మరణంపై నిరసన తెలిపేందుకు హెచ్‌‌‌‌సీయూకు రాహుల్​గాంధీ వస్తే.. ప్రభుత్వ ఎస్కార్ట్‌‌‌‌తో మేమే తీసుకెళ్లాం. ఇప్పుడు అదే హెచ్‌‌‌‌సీయూలో కాంగ్రెస్​ప్రభుత్వం ఆడపిల్లల బట్టలు చింపి, జుట్టుపట్టి పోలీసులతో కొట్టించింది. 

ఇదేనా ప్రజాపాలన అంటే?రాహుల్​గాంధీ చెప్పినట్టు రాష్ట్రంలో మొహబ్బత్​కీ దుకాన్​ ​నడవడం లేదు.. నఫ్రత్ కా మకాన్​లా తెలంగాణ మారింది” అని విమర్శించారు. రాహుల్​గాంధీ ఓ పొలిటికల్​ టూరిస్ట్​అని కామెంట్ చేశారు. కాగా, కేంద్రమంత్రి బండి సంజయ్‌‌‌‌పైనా కేటీఆర్ విమర్శలు చేశారు. ‘‘బండి సంజయ్..​ ఓ ఐటమ్ నంబర్​సిక్స్. ఆయన అప్పుడప్పుడైనా పార్లమెంటుకు వెళ్లి ప్రభుత్వ నివేదికలను చదువుకోవాలి. తంబాకు నములుకుంటూ అక్కడిక్కడ తిరగొద్దు. టైమ్‌‌‌‌పాస్​ చేయడం సంజయ్‌‌‌‌కు మంచిది కాదు” అని అన్నారు.