- రూ.25 వేల కోట్లతో అయ్యేదానికి లక్షన్నర కోట్లు ఎందుకు
హైదరాబాద్, వెలుగు : మూసీ బ్యూటిఫికేషన్ కాదు..లూటిఫికేషన్ చేస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. మూసీ బ్యూటిఫికేషన్, రెజువనేషన్ పనులను తమ ప్రభుత్వ హయాంలోనే ప్రారంభించామని, కొన్ని పనులు కూడా చేశామని తెలిపారు. తమ ప్రతిపాదనల్లో ఉన్న జనాల తరలింపును కేసీఆర్ వ్యతిరేకించారని, అందువల్లే ఆగిపోయామని అన్నారు.
మూసీ బ్యూటిఫికేషన్ మొత్తం ప్రాజెక్టుకు రూ.25 వేల కోట్లు ఖర్చు చేస్తే సరిపోతుందని, రూ. లక్షన్నర కోట్ల ఖర్చు దేనికని ఆయన ప్రశ్నించారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో మూసీ రెజువనేషన్‌పై కేటీఆర్ మీడియాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ‘‘2015లో అతి పెద్ద కాలుష్యమైన నది మూసీ అని సెంట్రల్ పొల్యూషన్ బోర్డు రిపోర్ట్ ఇచ్చింది. దీనికి గత పాలకులే కారణం. కేసీఆర్ వచ్చాక పొల్యూషన్ బోర్డు రిపోర్ట్ తెప్పించుకొని, మూసీని బాగుచేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. 2017 లో మొదటిసారి మూసీ రివర్ ఫ్రంట్ పేరుతో కార్పొరేషన్ ఏర్పాటు చేసి మూసీని బాగు చేయాలనుకున్నారు.
మూసీని మేం బ్యూటిఫికేషన్ తోపాటు పునరుజ్జీవనం చేస్తూ నల్గొండకు మంచి నీళ్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. కానీ, రేవంత్ రెడ్డి మూసీ పుట్టే వికారాబాద్ అడవుల్లోనే ఆ నదికి ఉరి వేసేలా రాడార్ నిర్మాణానికి అనుమతిచ్చారు” అని అన్నారు. మూసీ పై ఈస్ట్ టూ వెస్ట్ ఎక్స్ ప్రెస్ హైవే రూ.10 వేల కోట్ల ఖర్చుతో కట్టాలని, అర్బన్ మొబిలిటీ చేయాలని ఆలోచన చేశామని, మొత్తంగా తాము మూసీ ప్రాజెక్ట్ ను కేవలం రూ. 16 వేల కోట్లతో పూర్తి చేయాలని నిర్ణయించామని తెలిపారు. ‘‘కాళేశ్వరం నీళ్లను రూ. 11 వందల కోట్లతో గండిపేట్‌లో కలపాలని నిర్ణయం తీసుకున్నాం.
సౌత్ ఏషియాలోనే ఎక్కడాలేని విధంగా ఎస్టీపీలతో 100 శాతం మురుగు నీటిని శుద్ధి చేసే పని పెట్టుకున్నాం. మొత్తం 31 ఎస్టీపీలు పూర్తి చేస్తే.. నల్గొండకు పూర్తిగా స్వచ్ఛమైన నీరు వెళ్తుంది. ఎస్టీపీలు పూర్తయితే చాలు నల్గొండకు మంచి నీళ్లు వెళ్తాయి. వాటి కోసం రూ. లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేసి దోపిడీ చేయాల్సిన అవసరం లేదు. మూసీ మీద మేం దాదాపు 15 బ్రిడ్జిలు, వాటిపై చెక్ డ్యామ్ లు ప్లాన్ చేశాం. అక్కడ టూరిజం కూడా ప్లాన్ చేశాం. ప్రపంచస్థాయి 9 కంపెనీలతో మూసీ ప్రక్షాళనకు డిజైన్లు కూడా చేశాం. కావాలంటే ఆ డిజైన్లను సీఎం రేవంత్‌కు పంపిస్తా” అని కేటీఆర్ వివరించారు.