- ప్రధాని మోదీని నిలదీసిన కేటీఆర్
- బీజేపీ హయాంలో అనధికార ఎమర్జెన్సీ కొనసాగుతున్నది
హైదరాబాద్, వెలుగు: చోటేభాయ్ (సీఎం రేవంత్రెడ్డి) అక్రమంగా ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న మీరేం చేస్తున్నారు?’’ అని ప్రధాని మోదీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు. ‘‘మీ రాజకీయ ప్రత్యర్థులపై కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తున్నారు. మరి చోటేభాయ్ నిర్వాకాన్ని మాత్రం ఎందుకు క్షమిస్తున్నారు ? ఇవాళ చోటేభాయ్ అక్రమాలను.. ఆర్ఆర్ ట్యాక్స్ వసూళ్లను చూసీ చూడనట్టు వదిలేస్తే...రేపు డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పాటుకు మీకు సహకరిస్తాడనా ?’’ అని ప్రధాని మోదీ మెదక్ జనసభలో చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి కేటీఆర్ ట్వీట్ చేశారు.
తెలంగాణ వరప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్టుపై కూడా బడేభాయ్, చోటేభాయ్ ది ఒకే మాట, ఒకే బాట అని, ఒకరు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును బలిచేయాలని చూస్తుంటే.. మరొకరు తమిళనాడు కోసం తాకట్టుపెట్టాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను దెబ్బతీసే ఈ ఫెవికాల్ బంధంపై యుద్ధానికి తెలంగాణ సమాజం సిద్ధం అని పేర్కొన్నారు. మండుతున్న ధరలపైనా, తీవ్రమవుతున్న నిరుద్యోగంపైనా, దళితులపై జరుగుతున్న దాడులపైనా, మైనారిటీల్లో పెరుగుతున్న అభద్రతపైనా మోదీ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం అన్యాయమని పేర్కొన్నారు.
రాజ్యాంగంపై ప్రమాణం చేసి.. అదే రాజ్యాంగాన్ని కాలరాయడం భావ్యమా? అని ప్రశ్నించారు. రాజ్యాంగ సంస్థలను దెబ్బతీయడం ధర్మమా? అని నిలదీశారు. నాడు కాంగ్రెస్ పాలనలో దేశం ఎమర్జెన్సీని చూసిందని.. ఇప్పుడు బీజేపీ హయాంలో అనధికార ఎమర్జెన్సీని చవిచూస్తోందని అన్నారు.