సోనియా, రాహుల్ కేసుపై రేవంత్ మౌనం ఎందుకు.?: కేటీఆర్

సోనియా, రాహుల్ కేసుపై  రేవంత్ మౌనం ఎందుకు.?: కేటీఆర్

నేషనల్ హెరాల్డ్ కేసుపై సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులంతా దేశ వ్యాప్తంగా వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతుంటే  రేవంత్ మాత్రం తన బాస్ లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు కేటీఆర్. ఇది తానొక్కడికే వింతగా అనిపిస్తుందా? రేవంత్ కి ఇంకేమైనా ఆలోచనలు ఉన్నాయా అని కేటీఆర్ తన ఎక్స్ లో పోస్ట్ చేశారు. 

నేషనల్ హెరాల్డ్ కేసులో ఏ1 సోనియా,ఏ2గా రాహుల్ గాంధీ పేర్లను చేర్చడంపై గత మూడు రోజులుగా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు నిరసనలు ఆందోళన చేస్తున్నారు.  తెలంగాణలో కూడా టీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్  ఆధ్వర్యంలో నిరసనలు తెలుపుతున్నారు.  అయితే సీఎం రేవంత్ వారం రోజుల జపాన్ టూర్ లో ఉన్న విషయం తెలిసిందే..

నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.  గాంధీ కుటుంబంపై ఇది తొలి ఛార్జ్షీట్.ఈ కేసులో ఏప్రిల్ 25న కోర్టు విచారణ చేపట్టనుంది.మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA), 2002 లోని సెక్షన్ 44,45 ,సెక్షన్ 3 ,4, సెక్షన్ 70 కింద నేరానికి పాల్పడినందుకు ప్రాసిక్యూషన్ ఫిర్యాదును ఈడీ దాఖలు చేసింది. 

ఏంటీ నేషనల్​ హెరాల్డ్​ కేసు..?

ఏజేఎల్, దాని యాజమాన్య కంపెనీ యంగ్ ఇండియన్​ కంపెనీపై మనీ లాండరింగ్ కేసు ఇది. నేషనల్ హెరాల్డ్ కేసుగా ప్రచారంలో ఉంది. నేషనల్ హెరాల్డ్ పత్రికకు పబ్లిషర్స్‌‌‌‌‌‌‌‌గా ఏజేఎల్ ఉండగా, యంగ్ ఇండియన్‏లో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి 38 శాతం చొప్పున మెజారిటీ షేర్లు ఉన్నాయి. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు ఏజేఎల్ బకాయి పడిన రూ.90 కోట్లను వసూలు చేసుకునే విషయంలో యంగ్ ఇండియన్​లో ఆర్థిక అవకతవకలు జరిగాయని ఈడీ ఆరోపిస్తున్నది.ఇప్పటికే ఈ కేసులో సోనియా, రాహుల్‌ లకు సంబంధమున్న ఆస్తుల స్వాధీనానికి ఈడీ నోటీసులు జారీ చేసింది. 

రాహుల్, సోనియాగాంధీ మెజారిటీ వాటాదారులుగా ఉన్న అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL),యంగ్ ఇండియన్ లిమిటెడ్‌కు సంబంధించిన ఆర్థిక అవకతవకలపై ఈడీ కేసు నమోదు చేసింది. యంగ్ ఇండియన్,  AJL ఆస్తులను కూడబెట్టేందుకు నేరపూరిత కుట్ర,నిధుల దుర్వినియోగం జరిగినట్లు ED ఆరోపించింది.