హనుమకొండ: పొంగులేటి బాంబుల శాఖ మంత్రి అని, కాంగ్రెస్లో ఎప్పుడు బాంబులు పేలుతాయో వాళ్లనే అడగాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. హనుమకొండలో కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించి సరిగ్గా ఏడాదైందని, ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. వెనుకబడిన వర్గాలకు వెన్నుపోటు పొడిచిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని కేటీఆర్ విమర్శించారు. చేతి వృత్తుల వారికి కాంగ్రెస్ చేయిచ్చిందని, కొత్త పథకాలు కాదు.. ఉన్న పథకాలకే పాతర వేసిందని మండిపడ్డారు.
Also Read : జ్యోతక్క మృతి బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు తీరని లోటు
బీసీల ఓట్ల కోసం కులగణన అనే కొత్త జపం ఎత్తుకున్నారని, కులగణన కోసం వెళ్తున్న అధికారులను ప్రజలు నిలదీస్తున్నారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఆరు గ్యారంటీలు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారని, 42శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చిన తర్వాతే గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఓబీసీ శాఖ పెట్టలేదని, త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల యాత్ర చేస్తామని చెప్పారు. పాదయాత్రపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.