హైదరాబాద్, వెలుగు: చలో ప్రజా భవన్‌కు పిలుపునిచ్చిన రైతులను అరెస్ట్ చేయడం దుర్మార్గం అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇలాంటి అప్రజాస్వామిక చర్యలను ఆపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రుణమాఫీ కోసం రైతులు సంఘటితమై ఉద్యమం చేస్తున్నారని, ఇలాంటి అరెస్టులతో ఆ ఉద్యమాన్ని అడ్డుకోలేరని కేటీఆర్ గురువారం ‘ఎక్స్’లో పేర్కొన్నారు. రూ.2 లక్షల రుణమాఫీపై సీఎం రేవంత్ రైతులను మోసం చేశారని దుయ్యబట్టారు.
రైతుల శక్తి ముందు కాంగ్రెస్ ప్రభుత్వం తలవంచక తప్పదన్నారు. గాంధీ హాస్పిటల్‌లో పిల్లల మరణాలపై తమ పార్టీ తరఫున ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏర్పాటు చేస్తామని కేటీఆర్ మరో ట్వీట్ చేశారు. తమ ఫైండింగ్ కనుగొన్న విషయాలను ప్రజలకు, ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పారు. ప్రైవేటు హాస్పిటళ్లకు తాము కొమ్ముకాయడం లేదని, ఇలాంటి ఎదురుదాడి సరికాదన్నారు. ఇప్పటికైనా గాంధీ హాస్పిటల్‌లో జరిగిన మరణాలపై ప్రభుత్వం దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు.