రైతు భరోసాపై సీఎం ఏమీ తేల్చలే : కేటీఆర్​

రైతు భరోసాపై సీఎం ఏమీ తేల్చలే : కేటీఆర్​
  • కొర్రీలు పెట్టి ఎగ్గొట్టే ఆలోచన ఉందేమో: కేటీఆర్​
  • పైసలు వదులుకోవద్దని రైతులకు బీఆర్ఎస్  నేత బహిరంగ లేఖ

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీలో రైతుభరోసాపై సీఎం రేవంత్​ రెడ్డి ఎటూ తేల్చకుండా దాటవేశారని, అటెన్షన్​ డైవర్షన్​ గిమ్మిక్కులను ప్రదర్శించారని బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ అన్నారు. కాంగ్రెస్​ తీరు చూస్తుంటే రైతు భరోసాకు కొర్రీలు పెట్టి సగానికి సగం ఎగ్గొట్టే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతున్నదన్నారు. ఈ మేరకు ఆదివారం రైతులకు కేటీఆర్  బహిరంగ లేఖ రాశారు. రైతు భరోసాను సగం సగం అమలు చేసి రైతులను నిండా ముంచేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు.

ప్రభుత్వ తీరుపై రైతులు జాగ్రత్తగా ఉండాలని, ఇప్పుడు మేల్కోకపోతే భరోసా ఉండదని, గోస మాత్రమే మిగులుతుందన్నారు. ‘‘రైతుబంధుకు కేసీఆర్  రూ.10 వేలే ఇస్తున్నడు. తాము అధికారంలోకి వస్తే రూ.15 వేలు ఇస్తామని కాంగ్రెస్  నేతలు ఇంటింటికీ తిరిగి గ్యారంటీ కార్డులు పంచారు. వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి ఏడాదవుతున్నా రైతుభరోసా ఇవ్వలేదు. ఒక్కో రైతుకు ఒక్కో ఎకరానికి ప్రభుత్వం రూ.17,500 బాకీ పడింది.  హక్కుగా రావాల్సిన సొమ్మును రైతులు ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోవద్దు” అని కేటీఆర్  పేర్కొన్నారు. అలాగే, కేబినెట్​ సబ్​ కమిటీ పేరుతో ఇన్నాళ్లూ రైతుభరోసాపై కాలయాపన చేశారని కేటీఆర్​ ఆరోపించారు.

పన్ను కట్టే వాళ్లకు, పాన్​ కార్డు ఉన్నోళ్లకు రైతుబంధు కట్​ చేస్తామని పత్రికల్లో వార్తలు రాయించారన్నారు. లక్షలాది మంది ఉద్యోగులకు భూమితో ఉన్న బంధాన్ని తెంచేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. పీఎం కిసాన్​ మార్గదర్శకాలనే రైతు భరోసాకు వర్తింపజేస్తామంటున్నారని, అదే జరిగితే సగం మందికి కూడా రైతుభరోసా రాదని ఆయన ఆరోపించారు.