హైదరాబాద్, వెలుగు: తెలంగాణ నుంచి కేన్స్ టెక్నాలజీ కి చెందిన అత్యంత ఆధునాతనమైన యూనిట్ గుజరాత్ కు తరలిపోతున్నది వాస్తవమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ మేరకు బుధవారం ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా కేన్స్ సంస్థ తెలంగాణలోనే ఉంటుందన్నట్టుగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చేసిన ప్రకటనపై మండిపడ్డారు. కేన్స్ సంస్థ తెలంగాణలో మూడు యూనిట్లు స్థాపించేలా ఒప్పించి వారికి అన్ని అనుమతులు ఇచ్చామని తెలిపారు.
సాధారణ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్ ఒకటి, కొంగర కలాన్ లో అత్యంత అధునాతమైన యూనిట్, వరంగల్ లో పీసీబీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు ఆ కంపెనీని ఒప్పించామని చెప్పారు. కొంగర కలాన్ లో ఏర్పాటు చేయాల్సిన యూనిట్ గుజరాత్ కు తరలిపోయిందని, ఇక వరంగల్ లో ఏర్పాటు చేయాల్సిన పీసీబీ యూనిట్ పై స్పష్టత లేకుండా పోయిందన్నారు. ప్రస్తుతం కేన్స్ సంస్థ సాధారణ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్ ను మాత్రమే కొంగర్ కలాన్ లో ఏర్పాటు చేయనుందన్నారు.