- కూకట్‌పల్లిలో బుచ్చమ్మ కుటుంబానికి కేటీఆర్ పరామర్శ
కూకట్పల్లి, వెలుగు: చెరువుల రక్షణ ముసు గులో హైడ్రా పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకాన్ని అడ్డుకుంటామని, బాధితులకు అండగా ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ఒక్క ఇల్లు కూడా కట్టించలేదు కానీ.. పేదల ఇండ్లను అన్యాయంగా కూల్చేస్తూ ఆత్మహత్యలకు కారణం అవుతున్నదని ఆరోపించారు. రెండు నెలల కింద కూకట్ పల్లిలోని నల్లచెరువు వద్ద హైడ్రా అధికారులు షెడ్లను కూల్చివేసిన సమయంలో ఆందోళనకు గురై బుచ్చమ్మ అనే మహిళ సూసైడ్ చేసుకున్నదని కేటీఆర్ ఆరోపించారు.
సోమవారం బుచ్చమ్మ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బుచ్చమ్మది ఆత్మహత్య కాదని, ప్రభుత్వం చేసిన హత్యేనని ఆయన ఆరోపించారు. ఈ అంశంపై సీఎం రేవంత్‌రెడ్డితో పాటు ప్రభుత్వంపై హత్య కేసు నమోదు చెయ్యాలని డిమాండ్ చేశారు. అనారోగ్యంతో బాధ పడుతున్న బుచ్చమ్మ కూతురు వైద్య ఖర్చులకు పార్టీ సాయం చేస్తుందని హామీ ఇచ్చారు. రేవంత్‌రెడ్డి అన్నకు అయితే నోటీసులు ఇచ్చే అధికారులు పేదలకు ఎలాంటి నోటీసులివ్వకుండానే కూల్చివేయటం అన్యాయమన్నారు.