- ప్రభుత్వం పెడుతున్నదితెలంగాణ తల్లి విగ్రహమా..కాంగ్రెస్ తల్లి విగ్రహమా: కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: మంచి ప్రవర్తనతోనే వ్యక్తులకు మర్యాద వస్తుందని, అడుక్కుంటే రాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి తన నోటి తీరును మార్చుకుంటేనే ఆయన పదవికి గౌరవం దక్కుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కేసీఆర్‌పై కారుకూతలు మానకుంటే సీఎం పదవికీ గౌరవం ఇవ్వాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. శుక్రవారం తెలంగాణభవన్‌లో నిర్వహించిన అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది తెలంగాణ తల్లి విగ్రహమా.. కాంగ్రెస్ తల్లి విగ్రహమో చెప్పాలన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడు విగ్రహాల రూపు, చరిత్రను మారుస్తామంటే ఎవరూ ఒప్పుకోరన్నారు. తాము అధికారంలోకి వచ్చాక సెక్రటేరియెట్ ఎదుట ఉన్న రాహుల్ గాంధీ తండ్రి విగ్రహాన్ని పంపాల్సిన చోటుకు పంపిస్తామని తెలిపారు. సోమవారం నుంచి నిర్వహించనున్న అసెంబ్లీ సమావేశాలను కనీసం నెల రోజులపాటు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఏడాది పాలనలో కాంగ్రెస్ చేసిన అన్యాయాలను కచ్చితంగా ప్రశ్నిస్తామన్నారు.
అంబేద్కర్ విగ్రహంపై నిర్లక్ష్యం ఎందుకు?
దళితులకు స్ఫూర్తినిచ్చే భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నదని ప్రశ్నించారు. తాళాలేసి విగ్రహాన్ని బంధించారని, కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాలతోనే అంబేద్కర్ విగ్రహాన్ని అవమానిస్తున్నారా అని ప్రశ్నించారు. దళితుల అభివృద్ధికీ ప్రభుత్వం వ్యతిరేకంగా పనిచేస్తున్నదన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజ్యాంగ పరిరక్షకుడిలాగా పోజులు కొడుతూ దేశంలో తిరుగుతున్నారని విమర్శించారు.
రాజ్యాంగంపై రాహుల్‌కు నిజంగా ప్రేమ ఉంటే.. సీఎం రేవంత్ వ్యవహరిస్తున్న తీరుపై స్పందించాలన్నారు. కేసీఆర్ కట్టిన సచివాలయం, కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్షలు చేస్తున్న రేవంత్ రెడ్డి.. కేసీఆర్ పెట్టిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి మాత్రం నివాళి అర్పించకుండా నిర్బంధాలు చేస్తున్నారని మండిపడ్డారు.