- రైతుబంధు నిధుల నుంచే 7 వేల కోట్లు మళ్లించారు: కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: రుణమాఫీ పేరిట మరోసారి రాష్ట్ర రైతులను రేవంత్ సర్కార్ మోసం చేస్తోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రైతుబంధు కింద జూన్ నెలలో ఇవ్వాల్సిన నిధులలోంచే రూ.7 వేల కోట్లను మళ్లించి, రుణమాఫీ చేస్తున్నామని పోజులు కొడుతున్నారని ఆయన విమర్శించారు. ఈ మేరకు గురువారం కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. లక్షలోపు రుణాలు 40 లక్షల మంది రైతులకు ఉన్నాయని, అందులో నుంచి 11 లక్షల మందికే రుణమాఫీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
2014, 2018లో కేసీఆర్ సర్కార్ చేసిన రుణమాఫీతో పోలిస్తే పావు వంతు మంది రైతులకే రేవంత్ సర్కార్ రుణమాఫీ చేస్తోందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టు రూ.2 లక్షల వరకు ఉన్న పంటరుణాలు అన్నీ వెంటనే మాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అర్హులైన అందరు రైతులకూ రైతుబంధు విడుదల చేయాలన్నారు.
ప్రజలతో ఎలా మాట్లాడాలో పోలీసులకు నేర్పించాలి
ప్రజలతో ఎలా మాట్లాడాలో పోలీసులకు నేర్పించాలని డీజీపీకి కేటీఆర్ సూచించారు. లారీ డ్రైవర్‌ను పోలీసులు తిడుతున్న వీడియోను గురువారం ఆయన ట్విటర్‌లో పోస్ట్ చేసి, ఆ ట్వీట్‌కు డీజీపీని ట్యాగ్ చేశారు. ‘‘ఈ మధ్యకాలంలో పోలీసులు ప్రజలతో ప్రవర్తిస్తున్న తీరు అనేకసార్లు మా దృష్టికి వచ్చింది. ఇలాంటి వీడియోలు పదుల సంఖ్యలో సామాజిక మాధ్యమాల్లో వస్తున్నా ఉన్నతాధికారులు స్పందించడం లేదు.
ప్రజలతో నేరుగా తమ విధులను నిర్వర్తించే పోలీస్ సిబ్బందికి ప్రజలతో వ్యవహరించే విషయంలో ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని డీజీపీకి సూచిస్తున్నాం”అని ట్వీట్‌లో కేటీఆర్ పేర్కొన్నారు.