రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్​ది మంత్రసాని పాత్రే: కేటీఆర్

రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్​ది మంత్రసాని పాత్రే: కేటీఆర్
  •  కేసీఆర్​ చావునోట్లో తలపెట్టి తెచ్చారు: కేటీఆర్​
  • 420 హామీలిచ్చి కాంగ్రెస్​ అధికారంలోకొచ్చి జనవరి 30 నాటికి 420 రోజులు
  • ఆ రోజు రాష్ట్రమంతా గాంధీ విగ్రహాలకు వినతిపత్రాలిస్తం
  •  సీఎం రేవంత్.. అపరిచితుడిలా మారుతున్నారని కామెంట్​

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్​ది మంత్రసాని పాత్ర తప్ప మరేం కాదని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​అన్నారు. చావునోట్లో తలపెట్టి కేసీఆర్​తెలంగాణ తెచ్చారన్నారు. 

సోమవారం తెలంగాణ భవన్​లో బీఆర్​ఎస్​వీ క్యాలెండర్​ ఆవిష్కరణ సందర్భంగా కేటీఆర్​ మాట్లాడారు. కాంగ్రెస్​ ప్రభుత్వం 420 హామీలిచ్చి అధికారంలోకి వచ్చి జనవరి 30 నాటికి 420 రోజులవుతుందన్నారు. 

కానీ, ఇప్పటికీ అహ నాపెళ్లంట సినిమాలోలాగా పైన కోడిని వేలాడదీసి .. అదిగో చికెన్​ అనేలా హామీల అమలులో మోసం చేస్తున్నదని విమర్శించారు. ఢిల్లీ టూరిస్టులను తీసుకొచ్చి హామీలు, డిక్లరేషన్లు ఇప్పించారన్నారు. 

కాంగ్రెస్ డిక్లరేషన్లు నాలుక గీసుకునేందుకు కూడా పనికిరావన్నారు. రైతు భరోసా డబ్బులు అర్ధరాత్రి తర్వాత అందరి ఖాతాల్లో పడుతాయని సీఎం రేవంత్​ రెడ్డి చెప్పారని, ఆ తర్వాత పావుగంటకే మార్చి 31న పడతాయంటూ మాట మార్చారని అన్నారు. 

సీఎం రేవంత్​ రెడ్డి అపరిచితుడిలా వ్యవహరిస్తున్నారన్నారు. మండలానికో గ్రామానికే రైతు భరోసా ఇస్తామంటున్నారని, అంటే 612 గ్రామాలకే రైతు భరోసా వస్తుందని చెప్పారు.

అబద్ధాలు చెప్పి కాంగ్రెస్​ నేతలు అందరి చెవిలో పువ్వు పెట్టారని, అందుకే వారిని నిలదీసేందుకు జనవరి 30న రాష్ట్రమంతటా గాంధీ విగ్రహాలకు బీఆర్​ఎస్​ నేతలు చెవిలో పూలు పెట్టుకుని వినతిపత్రాలు సమర్పించాలన్నారు. 

రేషన్​ కార్డులు చరిత్రాత్మకమా?

రేషన్​ కార్డుల జారీ చరిత్రాత్మకమన్న సీఎం, డిప్యూటీ సీఎంల మాటలు వింటే నవ్వొస్తున్నదని కేటీఆర్​ అన్నారు. గతంలో కార్డులు ఎవరూ ఇవ్వనట్టే మాట్లాడుతున్నారన్నారు. బీఆర్​ఎస్​ హయాంలో ఆరున్నర లక్షల కార్డులిచ్చినా.. ఇవ్వలేదంటూ డిప్యూటీ సీఎం అబద్ధాలు చెప్పారన్నారు. 

‘‘ఇంటింటికీ గ్యారంటీ కార్డులు పంచారు.. అబద్ధాలు ప్రచారం చేశారు. రాహుల్ గాంధీ హైదరాబాద్ అశోక్ నగర్ వచ్చి నిరుద్యోగులతో చాయ్ తాగి... కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలిస్తామన్నారు.

 12 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వం ఏడాదికి వెయ్యి ఉద్యోగాలైనా ఇవ్వలేదు.. కానీ, మేం అధికారంలోకి వచ్చాక సగటున ఏటా 16 వేల ఉద్యోగాలిచ్చినం. పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ పరీక్ష పేపర్​ లీకేజీ అని చెప్పి బీఆర్​ఎస్​పైకి విద్యార్థులను ఉసిగొల్పారు. 

అందులో కాంగ్రెస్​ వాళ్లు సక్సెస్​ అయ్యారు. కానీ, ఇప్పుడు మాత్రం ఉద్యోగాలివ్వడం లేదు. బీఆర్​ఎస్​ నోటిఫికేషన్​ ఇచ్చిన ఉద్యోగాలను తామిచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు. పెట్టుబడుల విషయంలో కేసీఆర్‌‌‌‌కు, నాకు ఏదో అజీర్తి అయినట్టు ఈనో ప్రకటనలు వేస్తున్నరు. 

రేవంత్ రెడ్డి.. నిజంగా నువ్వు లక్షా ఎనభై వేల కోట్ల పెట్టుబడులు తెచ్చినట్టయితే మేమే నీకు సన్మానం చేస్తం. ఆ పెట్టుబడులు ఎప్పటివరకు రాష్ట్రంలో నిజరూపం దాలుస్తాయి’’ అని ప్రశ్నించారు. 

రుణమాఫీ కాక ఎండ్రిన్​ డబ్బాలు పట్టుకుని రైతులు బ్యాంకుల్లోనే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. 420 రోజుల్లో 410 మంది రైతులు సూసైడ్ చేసుకున్నారన్నారు. గురుకులాల్లో 55 మంది విద్యార్థులు, 30 మంది నేతకార్మికులు, వంద మంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు.