- బాధితులను ఏకంచేసి, సర్కారుపై పోరాడుతాం: కేటీఆర్
- కూకట్‌పల్లిలో పర్యటించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
కూకట్పల్లి, వెలుగు: నగరంలో హైడ్రా బుల్డోజర్లకు అడ్డం పడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్కేటీఆర్ అన్నారు. హైడ్రా బాధితులను ఏకంచేసి, ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం చేస్తామని చెప్పారు. త్వరలోనే నగరంలోని ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటుచేసి, అవసరమైన కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. హైడ్రా పేరుతో డ్రామాలు ఆపి, ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని సర్కారును డిమాండ్ చేశారు. బుధవారం కేటీఆర్.. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి ఫతేనగర్ డివిజన్‌పరిధిలో నాలా వద్ద, కూకట్పల్లి డివిజన్పరిధిలోని ఖాజాకుంట వద్ద ఏర్పాటు చేసిన సీవేజ్ట్రీట్మెంట్ప్లాంట్(ఎస్టీపీ)లను విజిట్చేశారు.
అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కేటీఆర్మాట్లాడుతూ.. అభివృద్ధిని గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అక్రమ నిర్మాణాల పేరుతో పేద ప్రజలను రోడ్ల పాలు చేస్తున్నదని మండిపడ్డారు. పెద్దలను వదిలేసి సామాన్య ప్రజలు, చిరు వ్యాపారులపై విరుచుకుపడడం శోచనీయమన్నారు. నగరంలోని చెరువులు, కుంటల్లో వెలిసిన అక్రమ నిర్మాణాల్లో ఎక్కువ శాతం కాంగ్రెస్ ప్రభుత్వంలో పర్మిషన్ ఇచ్చినవే అని చెప్పారు. మూసీలో మురుగు కలవకుండా తమ ప్రభుత్వం గ్రేటర్‌పరిధిలో రూ. 4 వేల కోట్లతో ఎస్టీపీలను ఏర్పాటు చేసిందని తెలిపారు. వీటిల్లో చాలామటుకు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని, మరికొన్ని ఆఖరి దశలో ఉన్నాయన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎస్టీపీలన్నింటినీ పూర్తి చేసి, ప్రారంభించాలని కోరారు. తమ ప్రభుత్వం నిజాయతీగా నగరాభివృద్ధికి కృషి చేయడం వల్లే నగర పరిధిలో తాము అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్స్వీప్చేశామన్నారు. నగర ప్రజలు తమకు ఓట్లు వేయలేదనే కక్షతోనే సీఎం రేవంత్‌రెడ్డి హైడ్రా పేరుతో పేదల ఇండ్లను కూలుస్తున్నారని ఆరోపించారు.
సంధికాలంలో ఉన్నం
ఇన్నాళ్లూ ఉద్యమ పార్టీగా, అధికార పార్టీగా ఉన్న బీఆర్‌ఎస్.. ఇప్పుడు తొలిసారి ప్రతిపక్ష పాత్రను పోషిస్తున్నదని, సంధికాలంలో ఉన్నామని కేటీఆర్ అన్నారు. ఈ సమయంలో పార్టీని బలోపేతం చేసుకోవాలని సూచించారు. పార్టీ ఆఫీసులో వరంగల్ వెస్ట్ నియోజకవర్గానికి చెందిన నేతలు, కార్యకర్తలతో నిర్వహించిన మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. యువత, నిరుద్యోగులు దూరమవడం, కార్యకర్తలు తమకేమీ లబ్ధి జరగలేదని భావించడం, చేసిన పనులను చెప్పుకోలేకపోవడం వల్లే గత ఎన్నికల్లో ఓడిపోయామని తెలిపారు.
బుద్ధభవన్, బల్దియా బిల్డింగ్ కూలుస్తవా?
మాదాపూర్‌లో ఎన్‌కన్వెన్షన్‌ను కూల్చేశారని, అయితే అక్కడ నిర్మాణానికి అనుమతిచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? అని కేటీఆర్ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ భవనంతోపాటు బుద్ధ భవన్ నాలాలపైనే ఉన్నాయని, ముందు వాటిని కూల్చే ధైర్యం సీఎంకు ఉందా? అని ప్రశ్నించారు. దమ్ముంటే నాలాలు, చెరువులు, కుంటల్లో పర్మిషన్ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎఫ్టీఎల్, బఫర్ పరిధిలో ఉన్న సీఎం అన్న తిరుపతిరెడ్డి ఇంటితో పాటు మంత్రులు, కాంగ్రెస్లీడర్ల గెస్ట్‌హౌస్‌లు, ఇండ్లను కూల్చేయాలని సవాల్ విసిరారు.
సీఎం అన్న ఇంటికి నోటీసులు ఇచ్చి కోర్టుకు వెళ్లే అవకాశం కల్పించిన అధికారులు.. పేద ప్రజల ఇండ్లను మాత్రం ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే కూల్చడం బాధాకరమన్నారు నగరంలో తమ హయాంలో 40 వేల డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టామని, వాటిని హైడ్రా బాధితులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. హైకోర్టు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేల వెన్నులో వణుకు పుడుతున్నదని, త్వరలో ఉప ఎన్నికలు రావడం ఖాయమని చెప్పారు. కూకట్పల్లి పక్కనే ఉన్న శేరిలింగంపల్లి నియోజకవర్గం ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి భారీ విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. కేటీఆర్‌తో పాటు పర్యటనలో ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మర్రి రాజశేఖర్‌రెడ్డి, కేపీ వివేకానంద, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్సీలు మహ్మద్‌అలీ, శంభీపూర్ రాజు పాల్గొన్నారు.