బ్లాక్​మెయిల్​ దందా కోసమే హైడ్రా: కేటీఆర్

బ్లాక్​మెయిల్​ దందా కోసమే హైడ్రా: కేటీఆర్
  • రాష్ట్రంలో బిల్డర్లు పర్మిషన్లు తీసుకోవడమూ కష్టమైంది: కేటీఆర్​

హైదరాబాద్, వెలుగు:  కేవలం బ్లాక్​మెయిల్​ దందా కోసమే హైడ్రాను తీసుకొచ్చారని, అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటున్నారని బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ అన్నారు. ప్రస్తుతం బిల్డర్లు పర్మిషన్లు తీసుకోవడం కూడా కష్టమైపోతున్నదన్నారు. ప్రాజెక్టుకు లేక్​ వ్యూ అని పేరు పెట్టాలంటేనే బిల్డర్లు భయపడుతున్నారని పేర్కొన్నారు. ఇంకో ఏడాది పాటు ఇదే పరిస్థితి ఉంటే చిన్న బిల్డర్లంతా తీవ్రంగా నష్టపోతారని చెప్పారు. శక్తికి మించి పెట్టుబడులు పెట్టిన భూములు అమ్ముడుపోవడం లేదని బాధపడ్తున్నారన్నారు. మంగళవారం హైదరాబాద్​లోని శ్రీనగర్​ కాలనీలో నిర్వహించిన తెలంగాణ రియల్టర్స్​ ఫోరమ్​ సమావేశంలో కేటీఆర్​ పాల్గొని మాట్లాడారు.కేసీఆర్ వల్లే రాష్ట్రంలో ఎకరం ధర కనీసం రూ.15 లక్షలు పలుకుతున్నదని చెప్పారు. రాష్ట్రంలో మంచిగున్న కరెంట్​ను నాశనం చేశారని విమర్శించారు. ‘‘ప్రజల చేతుల్లో డబ్బులు లేకుండా చేస్తున్నదీ ప్రభుత్వం. కాంగ్రెస్​ను నమ్మి మోసపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నల్గొండలో జరిగిన కాంగ్రెస్​ మీటింగ్​లో సొంత పార్టీ నేతలే ఆ పార్టీ చేసిన మోసాలను చెప్తున్నారు’’ అని పేర్కొన్నారు.

ఏ ఒక్క మంచి నిర్ణయం తీసుకోలే..

రియల్​ ఎస్టేట్​ గురించి తనకన్నా ఎక్కువ ఎవరికి తెలుసని సీఎం అన్నారని.. కానీ, 11 నెలలవుతున్నా రియల్​ఎస్టేట్​ రంగానికి సంబంధించి ఒక్క మంచి నిర్ణయం తీసుకోలేదని విమర్శించారు. ‘‘ప్రాజెక్టులు రద్దు చేస్తున్నారు. కొత్త ప్రాజెక్టులేమీ లేవు. బిల్డర్లను బెదిరించి డబ్బులు డిమాండ్​ చేస్తున్నారు. మా మీద కోపంతో వేలాది మంది కడుపులు కొట్టొద్దు. మంచిపనులు చేయండి. ఎన్నికల ప్రచారంలో నో ఎల్ఆర్ఎస్, నో బీఆర్ఎస్ అన్నారు. ఇప్పుడు మాత్రం ముక్కు పిండి మరీ ఎల్ఆర్ఎస్ ​వసూలు చేస్తున్నారు. హెచ్ఎండీఏ పరిధిలో రిజిస్ట్రేషన్లను రద్దు చేశారు. దీంతో మధ్యతరగతి ప్రజలకు ఎంతో నష్టం. అందుకే రియల్​ ఎస్టేట్​ ప్రతినిధులు ప్రశ్నించాలి. నేను కూడా అసెంబ్లీలో పోరాడతా’’ అని చెప్పారు. 

ఎవరు బాధ్యులు..

హైడ్రా పేరుతో ఓ గర్భిణి ఇంటిని కూల్చేయడంతో ఆమె తీవ్రంగా ఆవేదన చెందిందని, 40 ఏండ్లు ఈఎంఐ ఎలా కట్టాలని ప్రశ్నించిందని కేటీఆర్​ పేర్కొన్నారు. దానికి ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. హైడ్రానా? మున్సిపల్​ శాఖనా? ముఖ్యమంత్రా? ఎవరు సమాధానం చెప్తారన్నారు. రెరాతో తెలంగాణ రియల్టర్స్​ ఫోరమ్​ చర్చలు జరిపి.. లీగల్​ ఒపీనియన్​ తీసుకోవాలని కేటీఆర్​ సూచించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రతీకార చర్యలకు పాల్పడలేదని, ప్రజల సంక్షేమం గురించే ఆలోచించామన్నారు. ప్రభుత్వం తన ఆలోచనను మార్చుకుని ప్రజలకు మంచి చేస్తే నిర్మాణాత్మక ప్రతిపక్షంగా సహకరిస్తామని, మొండికేస్తే మాత్రం ప్రధాన ప్రతిపక్షంగా పోరాడుతామని కేటీఆర్ ​హెచ్చరించారు.