- నివాసితుల తరలింపునకు కేసీఆర్ ఒప్పుకోలే: కేటీఆర్
- పెద్ద బిల్డర్లను బెదిరించేందుకే హైడ్రాను వాడుతున్నరు
- హైదరాబాద్లో రియల్ ఎస్టేట్పడిపోయిందని కామెంట్
హైదరాబాద్, వెలుగు: మూసీ సుందరీకరణకు తమ ప్రభుత్వ హయాంలోనే ప్రతిపాదనలు రూపొందించామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. మూసీలో నివసిస్తున్న జనాలను సిటీ అవతలకు తరలించేందుకు చేసిన ప్రతిపాదనలను అప్పటి సీఎం కేసీఆర్ తిరస్కరించారని వెల్లడించారు. బుధవారం తెలంగాణ భవన్‌లో సిటీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులతో కేటీఆర్ భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘మూసీ సుందరీకరణకు మా ప్రభుత్వ హయాంలోనే ప్రతిపాదనలు, ప్రణాళికలు రూపొందించినం. నాగోల్‌లో నాలుగైదు కిలోమీటర్ల మేర డెవలప్ చేసినం. మూసీకి ఇరువైపులా ఏం చేయాలో ప్రతిపాదనలు తీసుకొని కేసీఆర్‌ను కలిశాం. ఆ ప్రతిపాదనలు పేదలకు నష్టం కలిగించేలా ఉన్నాయని చెప్పారు. సుందరీకరణ ఒకే కానీ, 40, 50 ఏండ్ల నుంచి నివసిస్తున్న గరీబోళ్లను అక్కడి నుంచి ఖాళీ చేయించి, ఊరవతలికి పంపిస్తాం అనడం కరెక్ట్ కాదని కేసీఆర్ మాతో అన్నారు. మేం తీసుకెళ్లిన ప్రతిపాదనలను వెనక్కి తీసుకోమని చెప్పారు. గరీబోళ్లకు నష్టం కలగకుండా కొత్త ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు” అని కేటీఆర్ వివరించారు.
మూసీ సుందరీకణపై సర్కారుకు ప్రణాళిక లేదు
మూసీ సుందరీకరణ విషయంలో రేవంత్‌రెడ్డి పూటకో మాట మాట్లాడుతున్నాడని కేటీఆర్ అన్నారు. అసలు ఒక ప్రణాళిక లేకుండా ప్రభుత్వం ముందుకెళ్తున్నదని ఆరోపించారు. దశాబ్దాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వమే పర్మిషన్లు ఇచ్చి, ఇప్పుడు అదే ప్రభుత్వం పేదల ఇండ్లను కూలగొడుతున్నదని చెప్పారు. పెద్ద పెద్ద బిల్డర్లను బెదిరించేందుకే హైడ్రాను ఉపయోగిస్తున్నారని ఆరోపించారు.
మూసీ పేరిట ఏ విధంగా లూటీ చేస్తున్నారో ప్రజల దృష్టికి తీసుకెళ్తామన్నారు. రేవంత్‌రెడ్డి పంపే బుల్డోజర్లకు బీఆర్ఎస్ నాయకులు అడ్డుగా ఉంటారని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలోనే మూసీ నీళ్ల శుద్ధికి ఎస్టీపీలు ఏర్పాటు చేశామని, వీటితో నల్గొండకు శుద్ధి చేసిన నీళ్లే వెళ్తున్నాయని తెలిపారు. హైడ్రా కారణంగా రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయిందని తెలిపారు.
ఓ వైపు మూసీ సుందరీకరణ అంటూ.. మూసీ పురిటి గడ్డ వికారాబాద్ అడవుల్లో రాడార్ స్టేషన్‌కు అనుమతులు ఎలా ఇస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తమ సర్కార్ హయాంలో 2017లో రాడార్ నిర్మాణం కోసం జీవో ఇచ్చామని, అయితే పర్యావరణం దెబ్బతింటుందనే ఉద్దేశంతో తామే ఆ జీవోను తొక్కి పెట్టాం అని కేటీఆర్ తెలిపారు.