- లాయర్‌తో వెళ్లగానే సీఎం రేవంత్‌రెడ్డి భయపడ్డడు: కేటీఆర్
- హైకోర్టు కొట్టేసింది క్వాష్ పిటిషనే.. దానిపై సుప్రీంకోర్టుకు వెళ్లాం
- అణాపైసా అవినీతి చేయలే.. ఎలాంటి విచారణకైనా సిద్ధమని కామెంట్
హైదరాబాద్, వెలుగు: ఫార్ములా–ఈ రేస్ కేసు విషయంలో ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. లాయర్సమక్షంలోనే ఏసీబీ విచారణ జరగాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశామని చెప్పారు.
హైకోర్టు అనుమతిస్తే ఈ నెల 9న లాయర్లతోనే ఏసీబీ విచారణకు హాజరవుతానని, 16న ఈడీ ఎంక్వైరీకి వెళ్తానని తెలిపారు. అణాపైసా అవినీతి చేయని బిడ్డగా ఎలాంటి విచారణను ఎదుర్కోవడానికైనా రెడీ అని పేర్కొన్నారు.
మంగళవారం హైదరాబాద్ నందినగర్‌లోని తన ఇంటి వద్ద మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. పచ్చ కామెర్లోడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు.. అవినీతి చేసినోళ్లకు, డబ్బు సంచులతో దొరికినోళ్లకు, ప్రతిపనిలో అవినీతికి పాల్పడినోళ్లకు ప్రతి పనిలో ఎంతో కొంత చేతులు మారిందన్న ధ్యాసే ఉంటుందని పరోక్షంగా కాంగ్రెస్ నేతలను విమర్శించారు.
అందుకే ఫార్ములా –ఈ రేస్ విషయంలో ఏదో జరిగిందంటూ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని, కానీ, అదేమీ లేని లొట్టపీసు కేసు అని పేర్కొన్నారు. అయినా కూడా ఏసీబీ విచారణకు పిలిస్తే గౌరవంగా వెళ్లానని చెప్పారు.
ఈ లొట్టపీసు కేసుపెట్టి చిట్టినాయుడు (రేవంత్) శునకానందం, పైశాచికానందం పొందుతున్నారని, ఏసీబీ విచారణకు లాయర్‌తో వస్తానని చెప్పే తీసుకెళ్లానని, 45 నిమిషాలు అక్కడే ఉన్నానని, సీఎం రేవంత్ భయపడ్డారని అన్నారు.
నేను తప్పుచేసినట్టు హైకోర్టు చెప్పలే
ప్రభుత్వం పెట్టిన ఆరోపణలపై విచారణ చేసుకోవాలని మాత్రమే హైకోర్టు చెప్పింది తప్ప.. తనకేమీ శిక్ష వేయలేదని, తప్పు చేశానని చెప్పలేదని కేటీఆర్అన్నారు. ‘‘ఏసీబీ పెట్టింది అక్రమ కేసు, తప్పుడు ఎఫ్ఐఆర్ అని హైకోర్టులో పిటిషన్ వేశాం.
న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది. క్వాష్ పిటిషన్నే కోర్టు కొట్టేసింది. మేం దీనిపై ఇప్పటికే సుప్రీంకోర్టుకు వెళ్లాం. రెండు, మూడు రోజులు లేదా వారం రోజుల్లోనో తీర్పు వస్తుంది.
నాకు న్న హక్కుల మేరకు లాయర్‌ను తీసుకెళ్లాను’’ అని పేర్కొన్నారు. వంద శాతం ధర్మం, న్యాయం గెలుస్తుందని అన్నారు. నాలుగేండ్లలో తమపై మరిన్ని కేసులు పెడతారని ఆరోపించారు.
మేఘా సంస్థ మాకూ విరాళాలిచ్చింది
మేఘా సంస్థ తమకు కూడా విరాళాలిచ్చిందని, తమతోపాటు కాంగ్రెస్, బీజేపీలకూ ఇచ్చిందని కేటీఆర్ అన్నారు. మల్లన్నసాగర్ నుంచి హైదరాబాద్‌కు తాగునీటిని తరలించే రూ.4 వేల కోట్ల ప్రాజెక్టును మేఘాకే ఇస్తున్నట్టు తెలిసిందని అన్నారు.
మూసీ శుద్ధి ప్రాజెక్టునూ ఆ సంస్థకే ఇచ్చారన్న వార్తలు వస్తున్నాయని తెలిపారు. సుంకిశాల ఘటన తర్వాత మేఘా ఇంజినీరింగ్ సంస్థను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలంటూ హైదరాబాద్ మున్సిపల్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ సిఫార్సు చేసిందని, మరి ఆ సంస్థను ప్రభుత్వం ఎందుకు బ్లాక్‌లిస్టులో పెట్టట్లేదని నిలదీశారు.
మంత్రులే జడ్జిలైతున్నరు
కొందరు మంత్రులు వాళ్లే జడ్జిలైపోయి తీర్పులు చెప్తున్నారని, శిక్షలు వేస్తున్నారని కేటీఆర్ అన్నారు. తన హక్కుల కోసం ఎన్ని కోర్టులకైనా పోతానని, మంత్రులకు ఏం కడుపునొప్పి అని ప్రశ్నించారు.
‘‘విచారణ మీడియాలోనో, సెక్రటేరియెట్లోనో లేదంటే మంత్రుల పేషీల్లోనో జరగదు. కోర్టుల్లోనే విచారణ జరుగుతుంది. అందుకే మేం అక్కడికే వెళ్తున్నాం. ఫార్ములా– ఈ రేస్‌లో రూపాయి అవినీతి కూడా జరగలేదు.
ఈవీలకు హైదరాబాద్‌ను కేంద్రంగా నిలిపేందుకే ప్రయత్నించాం తప్ప.. కాంగ్రెస్ వాళ్లలాగా నికృష్టపు పనులు చేయలేదు’’ అని వ్యాఖ్యానించారు.
మీడియాపై ఆగ్రహం
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన ఫ్రస్ట్రేషన్‌ను మీడియాపై చూపించారు. అడ్వర్టైజ్మెంట్ల కోసం సీఎంవో లీకులను ఇష్టమొచ్చినట్టు రాస్తారా? అని ప్రశ్నించారు.
ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభం మీడియా అని, ఒక స్తంభం అబద్ధాలు, దాగుడుమూతలు ఆడుతుంటే.. అర్ధసత్యాలను ప్రచారం చేస్తుంటే ఫ్యాక్ట్ చెక్ చేసుకోకుంటే తప్పు కాదా? అని ప్రశ్నించారు.
మీడియా వాళ్లు కూడా ఆగం కావొద్దని, సీఎం నోటి నుంచి వచ్చేవన్నీ వేదవాక్కులు కావని, సీఎంవో నుంచి వచ్చే లీకులన్నీ నిజాలూ కావని పేర్కొన్నారు.