రేవ్​ పార్టీ కాదు.. ఫ్యామిలీ పార్టీ: మాజీ మంత్రి కేటీఆర్

రేవ్​ పార్టీ కాదు.. ఫ్యామిలీ పార్టీ: మాజీ మంత్రి కేటీఆర్
  • ఫ్యామిలీ ఫంక్షన్‌‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నరు: కేటీఆర్​
  • అక్కడ చిన్న పిల్లలు, మా అత్తమ్మ ఉన్నరు
  • ఇంట్లో దావత్​కు పర్మిషన్ తీసుకోవాలా?
  • రాజకీయంగా ఎదుర్కోలేకే ఇలా చేస్తున్నరని కామెంట్

హైదరాబాద్, వెలుగు: జన్వాడలో జరిగింది రేవ్ పార్టీ కాదని, అది ఫ్యామిలీ పార్టీ అని బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ తెలిపారు. రాజకీయంగా ఎదుర్కోలేక తన కుటుంబ సభ్యులను ప్రభుత్వం టార్గెట్ చేసిందని ఆరోపించారు.తనను జైలుకు పంపినా సర్కారుపై పోరాటం ఆపబోనని  అన్నారు.  తాము చావుకు సిద్ధపడి ఉద్యమం చేసినోళ్లమని, ఇలాంటి చిల్లర కేసులకు భయపడేది లేదని అన్నారు.  ఆదివారం రాత్రి నందినగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని తన నివాసంలో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. 

కాంగ్రెస్ సర్కారు వైఫల్యాలపై తాము రాజీలేని పోరాటం చేస్తున్నామని చెప్పారు. సీఎం రేవంత్ తన బామ్మర్దికి అమృత్ టెండర్లను కట్టబెట్టిన విషయాన్ని, సివిల్ సప్లైస్ స్కామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బయటపెట్టామని, మూసీ పునరుజ్జీవనం పేరిట జరుగుతున్న దోపిడీ  యత్నంపై  ప్రభుత్వాన్ని ప్రశ్నించామని, ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేక  ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. తన బామ్మర్ది రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాకాల జన్వాడలో కొత్త ఇల్లు కట్టుకున్నాడని, 15 రోజుల క్రితమే గృహ ప్రవేశం చేశాడని తెలిపారు.

 ఈ సందర్భంగా తన కుటుంబ సభ్యులకు, బంధువులకు శనివారం దావత్ ఇచ్చాడని కేటీఆర్ వెల్లడించారు. ఆ దావత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తాను హాజరు కాలేదని, శనివారం రాత్రి 8 గంటల వరకూ తాను ఎర్రవల్లిలోని ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఉన్నానని చెప్పారు. ఆ తర్వాత ఇంటికొచ్చి నిద్రపోయానని తెలిపారు. కానీ, దావత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తాను కూడా ఉన్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇదేం పద్ధతి అని ప్రశ్నించారు. 

ఇంట్లో మందు తాగితే తప్పేంటి?

కుటుంబ సభ్యులతో ఇంట్లో దావత్ చేసుకోవడానికి కూడా పోలీసుల అనుమతి తీసుకోవాలని చట్టాలు ఉన్నట్టు తమకు తెలియదని కేటీఆర్​ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.  దావత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చిన్న పిల్లలు, వృద్ధురాలైన తన అత్తమ్మ కూడా ఉందని తెలిపారు. కుటుంబ సభ్యులతో ఇంట్లో జరుపుకుంటున్న వేడుకను ‘రేవ్ పార్టీ’ అంటూ ప్రచారం చేయడం దారుణమని పేర్కొన్నారు. ఇంట్లో మందు తాగితే తప్పేంటి?  అని ఆయన ప్రశ్నించారు. ఆ ఇంట్లో డ్రగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దొరకలేదని, అసలు అలాంటి ఆనవాళ్లే లేవని పొద్దున ఎక్సైజ్ అధికారులు మీడియాకు స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ఇచ్చారని, సాయంత్రానికి డ్రగ్స్ అంటూ కేసులు పెట్టారని అన్నారు. 

ప్రభుత్వ పెద్దలు చెబితే ఇష్టమొచ్చినట్టు కేసులు పెడ్తారా? అని పోలీసులను నిలదీశారు. ‘‘ బాంబులు, గీంబులు అన్నరు. కొండను తవ్వి ఎలుకను పట్టిన్రు.14 మందికి టెస్టులు చేశామని, ఒకరికి డ్రగ్స్ టెస్ట్ పాజిటివ్ వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. 

ఆ వ్యక్తి ఎక్కడ డ్రగ్స్ తీసుకున్నాడో శోధించకుండా, ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టడం ఏంటి? అసలు డ్రగ్సే దొరకనప్పుడు ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీపీఎస్ సెక్షన్ల కింద కేసులు ఎలా పెడతారు? సప్లయర్, హోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కో హోస్ట్ అని ఏవేవో సెక్షన్లు చేర్చారు. మత్తు పదార్థాలు ఏవీ దొరక్కుండా ఇలాంటి కేసులు ఎలా పెడతారు?  కనీసం ఒక్క మిల్లీగ్రాం మత్తు పదార్థమైనా దొరికిందా?  కాంగ్రెస్, బీజేపీ నాయకులు కూడబలుక్కొని మాపై బురదజల్లుతున్నారు. 

4  లీటర్ల లిక్కర్ ఉండాల్సిన చోట ఎక్కువ బాటిళ్లు ఉన్నాయని, ఆ కేసు మాత్రమేనని పొద్దున చెప్పారు. సాయంత్రానికి డ్రగ్స్ కేసుగా మార్చేశారు. ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీపీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్షన్ల కింద కేసు చేశారు. నన్ను, మా పార్టీని ఎదుర్కోలేక, ఇష్టమొచ్చినట్టు అధికార దుర్వినియోగం చేస్తామంటే ఊరుకునేది లేదు. కచ్చితంగా మీ ఎంబడి పడ్తం” అని కేటీఆర్ అన్నారు.