- మీడియాతో చిట్‌చాట్‌లో కేటీఆర్
- రేవంతే అసలు సిసలు ఆర్ఎస్ఎస్ మనిషి
- నేను ఏ తప్పూ చేయలేదు.. ఎక్కడైనా చర్చకు సిద్ధం అని సవాల్
చేవెళ్ల, వెలుగు: పది మంది ఎమ్మెల్యేల అనర్హత విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్లామని, ఈ ఏడాదిలోనే ఆ పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ నియోజకవర్గాల్లో చేవెళ్ల కూడా ఉండబోతున్నదని తెలిపారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు భయపడుతున్నారని, వారిని మళ్లీ తమ పార్టీలోకి తీసుకునేది లేదని చెప్పారు. తమతో కొంతమంది కాంగ్రెస్ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని వ్యాఖ్యానించారు. శుక్రవారం షాబాద్‌లో రైతు దీక్షకు వచ్చిన కేటీఆర్.. మాజీ ఎంపీపీ అవినాష్ రెడ్డి ఇంట్లో మీడియాతో చిట్చాట్చేశారు. ‘‘రేవంత్ రెడ్డికి మళ్లీ సవాల్ విసురుతున్న. సెక్రటేరియెట్కైనా వస్త. లై డిటెక్టర్ టెస్ట్‌కు నేను రెడీ. పక్కన రేవంత్ రెడ్డి కూడా ఉండొచ్చు.
నాపై పెట్టింది కక్ష సాధింపు కేసు. ఎన్ని ప్రశ్నలకైనా సమాధానం చెప్పే సత్తా నా దగ్గర ఉంది” అని ఆయన అన్నారు. ‘‘ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ఒక్క పెట్టుబడి అయినా రాష్ట్రానికి తెచ్చారా? ఆయన ఏర్పాటు చేసిన దోపీడీ ముఠా రాష్ట్రంలో తిరుగుతున్నది. ఈ ముఠా.. కంపెనీలను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నది” అని ఆరోపించారు. ‘‘రేవంత్ రెడ్డే అసలు సిసలు ఆర్ఎస్ఎస్ మనిషి. ఏబీవీపీలో పనిచేసిందీ.. ఆర్ఎస్ఎస్ ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేసిందీ రేవంత్ రెడ్డినే. బీజేపీ, కాంగ్రెస్, ఈడీ, ఏసీబీ కలిసి మాపై కేసులు పెట్టినా.. మేం ప్రజల తరఫున ప్రశ్నించడం ఆపే ప్రసక్తే లేదు” అని ఆయన అన్నారు.
రాహుల్ కూడా క్వాష్ పిటిషన్ వాపస్ తీస్కున్నడు
రాహుల్ గాంధీ కూడా నేషనల్ హెరాల్డ్, ఆర్ఎస్ఎస్‌ను తిట్టిన కేసులో క్వాష్ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారని, ఆయన చేస్తే తప్పు కానిది..తాము చేస్తే తప్పు ఎలా అవుతుందని కేటీఆర్ప్రశ్నించారు. కాళేశ్వరం అని కొన్ని రోజులు, ఫోన్ ట్యాపింగ్అంటూ మరికొన్ని రోజులు ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని దుయ్యబట్టారు. ‘‘కాంగ్రెస్ అధిష్టానానికే తెలిసే రాష్ట్రంలో మోసాలు, దోపిడీలు జరుగుతున్నయ్” అని ఆయన ఆరోపించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇయ్యకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే ఊరుకునేది లేదన్నారు.