కొండా సురేఖకు కేటీఆర్​ లీగల్ ​నోటీసులు

కొండా సురేఖకు కేటీఆర్​ లీగల్ ​నోటీసులు
  • క్షమాపణలు చెప్పాలని డిమాండ్​
  • లేకుంటే పరువునష్టం కేసు వేస్తానని హెచ్చరిక

హైదరాబాద్, వెలుగు : మంత్రి కొండా సురేఖకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ బుధవారం లీగల్‌ నోటీసులు పంపించారు. సినీ స్టార్స్‌ నాగచైతన్య, సమంత విడిపోవడానికి తాను కారణం అంటూ సురేఖ మాట్లాడిన మాటలు అసత్యం అని, ఆ మాటలకుగానూ తనకు క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేదంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటానని, పరువునష్టం కేసు వేస్తానని ఆయన హెచ్చరించారు. గతంలో తనకు సంబంధం లేని ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులోనూ తనపై సురేఖ అసత్య ఆరోపణలు చేశారని

అప్పుడు కూడా ఆమెకు నోటీసులు పంపించానని కేటీఆర్ గుర్తు చేశారు. తన గౌరవానికి, ఇమేజ్‌కి భంగం కలిగించాలనే లక్ష్యంతోనే పదే పదే ఆమె ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. మహిళ అయి ఉండి సాటి మహిళ పేరును, సినిమా నటుల పేరును వాడుకొని, వారి వ్యక్తిత్వ హననానికి కూడా పాల్పడడం దురదృష్టకరమని కేటీఆర్​ అన్నారు.