- కేటీఆర్‌కు మంత్రి దామోదర హెచ్చరిక
హైదరాబాద్, వెలుగు : ప్రభుత్వ దవాఖాన్లు, ఆరోగ్య వ్యవస్థపై చవకబారు విమర్శలు మానుకోవాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. ఈహెచ్‌ఎస్‌పై కేటీఆర్ చేసిన ట్వీట్‌పై మంత్రి ఘాటుగా స్పందించారు.
ఆరోగ్య శ్రీ, ఈహెచ్‌ఎస్, జేహెచ్‌ఎస్ స్కీమ్‌లను పదేండ్లు భ్రష్టు పట్టించి, ఇప్పుడు సిగ్గులేకుండా నీతులు చెబుతారా అంటూ మంత్రి విమర్శించారు. బీఆర్‌ఎస్ పాలనలో ఆరోగ్యశ్రీ బిల్లులు విడుదల చేయకపోవడంతో పేదలు, ఉద్యోగులకు ఆ స్కీమ్ సేవలు అందకుండా పోయాయన్నారు.
ఈహెచ్‌ఎస్ కింద ట్రీట్‌మెంట్ చేసుకునేందుకు వెళ్లిన ఉద్యోగులు, పెన్షనర్లను కార్పొరేట్ హాస్పిటళ్ల యాజమాన్యాలు అవమానిస్తుంటే బీఆర్‌ఎస్ నాయకులు చోద్యం చూశారని మంత్రి విమర్శించారు. ‘‘మా వేతనాల్లో నుంచి కంట్రిబ్యూషన్ ఇస్తాం, స్కీమ్‌ను సమర్థవంతంగా అమలు చేయండని ఉద్యోగులు, పెన్షనర్లు కోరినా పట్టించుకోలేదు. పదేండ్లు మోసం చేసింది చాలదన్నట్టు, ఎన్నికల ముందు హడావుడిగా ఓ డమ్మీ జీవో ఇచ్చి మరోసారి ఉద్యోగులను మోసం చేసే కుట్రలు చేశారు.
మీ కుట్రలు, కుతంత్రాలు తెలుసుకోలేనంత అమాయకులు కాదు ఉద్యోగులు. ఇకనైనా ఇలాంటి చవకబారు విమర్శలు మానుకోవాలి” అని మంత్రి హెచ్చరించారు. ‘‘మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచినం. పదేండ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేయలేకపోయిన ప్యాకేజీల రివిజన్‌ను 6 నెలల్లోనే చేసి చూపించినం.
కొత్తగా 163 రకాల ప్రొసీజర్లను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చాం. ఉద్యోగులు, పెన్షనర్లు కోరుకున్నట్టుగా వారికి ఆమోదయోగ్యమైన రీతిలో ఈహెచ్‌ఎస్‌ను అమలు చేయబోతున్నాం”అని మంత్రి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.