‘మళ్లీ బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే రైతులకు ఇచ్చే రైతుబంధు కటాఫ్ విషయాన్ని పరిశీలిస్తున్నాం. రాష్ట్రంలో రైతులలో తక్కువ భూమి ఉన్న వారికి తక్కువ, ఎక్కువ భూమి ఉన్నవారికి ఎక్కువగా డబ్బులు అందుతున్నాయి. దీనివల్ల చిన్న, సన్నకారు రైతులు ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని గమనించాం. 4,5 ఎకరాలకే రైతుబంధుకు 'సీలింగ్ ‘పెట్టే విషయం పరిశీలనలో ఉంది’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 2023 నవంబర్ 8న ఒక కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. అయితే ప్రతిపక్ష పాత్రలోకి వెళ్లిన తర్వాత అందుకు విరుద్ధంగా కేటీఆర్ మాట్లాడుతున్నారు. రైతుబంధు పథకాన్ని అందరికీ అమలు చేయవలసిందేనని ఆయన పట్టుబడుతున్నారు. ఒకవేళ బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చి ఉంటే ఖచ్చితంగా రైతుబంధుపై 'సీలింగ్' విధించేవారని కేటీఆర్ వ్యాఖ్యల్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.
గుట్టలు, రాళ్లు, రప్పలకూ..
సాగులో లేని భూములు, రాళ్లు, రప్పలు, గుట్టలు,రోడ్లు, పరిశ్రమలుగా రూపాంతరం చెందిన వాటికి, లేఔట్లు వేసిన వాళ్లకు కూడా రైతు బంధు కింద డబ్బులు జమ చేయడం కేసీఆర్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి, బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. సాగులోలేని భూములకు కూడా రైతుబంధును అమలు చేసిన కారణంగా రూ. 22,606 కోట్లు దుర్వినియోగానికి గురయినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో చెప్పారు. కేసీఆర్ విధానాలు ఎందుకు అనుసరించాలి? సాగులో లేని భూములకు రైతుబంధు ఎందుకు ఇవ్వాలి అనేదే రేవంత్ ప్రభుత్వ అభిప్రాయం. కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో రాజీవ్ రహదారి, ఆమనగల్ నియోజకవర్గంలో రోడ్ల కింద పోయిన భూములకు కూడా రైతు బంధు పథకం కింద నిధులు అందాయి. కొన్ని చోట్ల క్రషర్లు, మరికొన్ని చోట్ల మైనింగ్ జరుగుతున్న భూములకు కూడా రైతు బంధు అమలు చేశారు. గిరిజనులు, ఆదివాసీల పేర్ల మీద బీఆర్ఎస్ నాయకులు నకిలీ పాస్ పుస్తకాలను సృష్టించి రైతు బంధు కింద లబ్ధి పొందినట్టు పథకం తనిఖీల్లో తేలిందంటున్నారు.
రియల్ ఎస్టేట్ లేఔట్లకు..
హైదరాబాద్‌కు చుట్టూ 50 కిలోమీటర్ల పరిధిలో 70 నుంచి 80 శాతం వ్యవసాయం ఎవరూ చేయడం లేదు. వ్యవసాయ భూములన్నీ రియల్ ఎస్టేట్‌గా, లేఔట్లుగా, ప్లాట్లుగా మారిన సంగతి అందరికీ తెలుసు. ప్రతి ఏటా రెండు సీజన్లకు కలిపి మూడు కోట్ల హెక్టార్లకు డబ్బులు రైతుబంధు కింద డబ్బులు వెళ్లాయి. వ్యవసాయం చేసుకునేవారికి మాత్రమే పెట్టుబడి సహాయం కింద కొంత నగదు మొత్తాన్ని అమలు చేయాలనేది ప్రభుత్వ లక్ష్యమని తెలుస్తోంది.అప్పట్లో చోటు చేసుకున్న లోపాలన్నింటినీ సరిదిద్దే పనిలో రేవంత్ ప్రభుత్వం ఉన్నది.
తమ హయాంలో గొప్పలకు పోయి విచ్చలవిడిగా ఖజానాను గుల్ల చేసి, రాష్ట్రాన్ని అప్పుల పాల్జేసినందున ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తే ఆ అప్పులకు వడ్డీ చెల్లించడమే భారంగా మారే అవకాశం ఉంటుందని కేసీఆర్‌కు ముందే తెలుసు. ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే పనిలో 'క్రమశిక్షణ' పాటించే సందర్భంలో కొన్ని పథకాలకు కత్తిరింపులు ఉంటాయనీ మాజీ సీఎంకు తెలియనిది కాదు. అందువల్లనే ఆయన ఎన్నికలకు ముందు రైతులను ఆకట్టుకోవడానికి, తమ పార్టీ వైపు మళ్లించడానికి ప్రయత్నించారు. కానీ, గ్రామీణ ప్రాంతాల్లో ఘోర ఓటమి చవిచూసినందున, రైతుబంధు ఎలాంటి ప్రభావం చూపలేదని మనకు అర్థమవుతున్నది. భూస్వాములకు, బడా పారిశ్రామిక వేత్తలకు కూడా 'రైతుబంధు' అమలు చేయడం సన్నకారు రైతులలో తీవ్ర అసంతృప్తి నెలకొన్నట్టు ఫలితాల సరళి తెలియజేసింది.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణ రాజకీయం రైతుబంధు చుట్టే తిరిగింది. రైతుబంధు పథకం నిధుల విడుదలకు ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, తాజాగా అందిన ఫిర్యాదులు, అభ్యంతరాల నేపథ్యంలో రైతుబంధు నిధుల విడుదలకు ఈసీ బ్రేకు వేసింది. రైతుబంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, ఆత్రుత, అహంకారం తప్ప, నిజంగా రైతులకు మేలు జరగాలన్న ఉద్దేశం లేదు. హరీష్ రావు వ్యాఖ్యల కారణంగానే రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటున్నట్టు ఈసీ ఆదేశాలు ఇచ్చింది.ఈ ద్రోహులను ఇంటికి పంపితే తప్ప రైతులకు న్యాయం జరగదు అని ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రజలకు చెప్పింది.'రైతుబంధు'పై అధ్యయనం చేసి మార్గదర్శకాలు రూపొందించడానికి మంత్రుల సబ్ కమిటీని సైతం ఏర్పాటు చేశారు. ఈ కమిటీ తన మార్గదర్శకాలను ప్రభుత్వానికి నేడో రేపో అందించనున్నది. అసలైన రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, రైతు భరోసా పథకం కింద ప్రజాధనం సమర్థవంతంగా వినియోగించేలా చూస్తామంటోంది ప్రభుత్వం.
అర్హులకే పథకాలతో ఆర్థిక క్రమశిక్షణ
ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు విషయంలో ఆచితూచి అడుగులేస్తోంది. ఆర్థిక వనరుల పరిమితి, ఇతర అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా జాగ్రత్తలు తీసుకునే పనిలో ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తున్నది. ఖజానాలో ఉన్న డబ్బుకు, అమలుచేసే కార్యక్రమాలకు మధ్య పొంతన ఉండాలి. ఇది ఒక రకంగా ప్రజాధనాన్ని వృథా కాకుండా అర్హులకు మాత్రమే రైతు భరోసా ఇవ్వడం అందరూ స్వాగతించదగ్గ విషయమే. మొత్తం మీద యువనేత కేటీఆర్ రైతుబంధుపై నవంబర్‌లో ఒకమాట, డిసెంబర్లో ఒక మాట మాట్లాడటమే ఆశ్చర్యంగా ఉంది!.
పదేండ్ల ఆర్థిక ఉగ్రవాదం
రైతుల ఆత్మహత్యలను నివారించడంలో కేసీఆర్ పాలనా వైఫల్యం బట్టబయలయ్యింది. కేసీఆర్ హయాంలో దేశంలోనే అత్యధికంగా రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉందని గణాంకాలు చెబుతున్నాయి. 2014లో 898 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 2015లో 1,358. 2016లో 632 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. బీఆర్‌ఎస్ నాయకులు ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని, వారు 'ఆర్థిక ఉగ్రవాదులు' అని సీఎం రేవంత్ చేసిన ఆరోపణ ఆలోచించదగ్గదే.
- ఎస్.కే.జకీర్,
సీనియర్ జర్నలిస్ట్