తెలంగాణను బుల్డోజర్ రాజ్యంగా మార్చొద్దు : కేటీఆర్

తెలంగాణను బుల్డోజర్ రాజ్యంగా మార్చొద్దు : కేటీఆర్
  • ఏఐసీసీ ప్రెసిడెంట్‌‌ ఖర్గేకు కేటీఆర్ లేఖ

హైదరాబాద్, వెలుగు: యూపీ తరహాలో తెలంగాణను బుల్డోజర్ రాజ్యంగా మార్చొద్దని బీఆర్‌‌‌‌ఎస్‌‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌‌ కేటీఆర్ కోరారు. కూల్చివేతలు ఆపేలా రేవంత్‌‌ సర్కార్‌‌‌‌కు ఆదేశాలు ఇవ్వాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు శుక్రవారం ఆయన లేఖ రాశారు. తెలంగాణలో చట్టం, న్యాయవ్యవస్థ పట్ల ధిక్కారం జరుగుతోందని కేటీఆర్ తన లేఖలో ఆరోపించారు. మహబూబ్‌‌నగర్‌‌‌‌లో 75 మంది పేదల ఇండ్లను నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా కూల్చేశారని ప్రస్తావించారు.

 ఇందులో 25 కుటుంబాల్లో దివ్యాంగులు ఉన్నారని తెలిపారు. విధివిధానాలు లేకుండా అమలు చేసే చట్టం అసలు చట్టమే కాదని చెప్పారు. నిరుపేదలపైకి అడ్డగోలుగా బుల్డోజర్ నడిపిస్తున్న కాంగ్రెస్ సర్కార్‌‌‌‌ను నిలువరించాలని, యూపీ తరహాలో తెలంగాణను బుల్డోజర్ రాజ్‌‌గా మార్చకుండా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఒకరి ఇంటిని కూల్చివేయడం అమానవీయమని గతంలో ఖర్గే చెప్పారని, ఆ మాటలను గుర్తుచేస్తున్నానని లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు. 

ఎందుకు కూల్చుతున్నరు: శ్రీనివాస్‌‌గౌడ్‌‌

మహబూబ్‌‌నగర్ అంధుల కాలనీకి 2007లో కాంగ్రెస్ ప్రభుత్వమే పట్టాలు ఇచ్చిందని, ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కట్టడాలంటూ కూల్చివేయడమేమిటని మాజీ మంత్రి శ్రీనివాస్‌‌గౌడ్‌‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అక్కడ చెరువు, కుంట ఏదీ లేదని.. కనీసం కోట్ల విలువ చేసే భూమి కూడా కాదన్నారు.  అక్రమంగా పేదల ఇండ్లను కూల్చేశారని ఆరోపించారు. బడాబాబులకు నోటీసులు ఇచ్చి, ఖాళీ చేసేందుకు నెల రోజుల సమయం ఇస్తున్న ప్రభుత్వం, పేదల ఇండ్లను మాత్రం నోటీసులు ఇవ్వకుండా కూల్చేస్తోందని విమర్శించారు.