- రైతుబంధు దుబారా అన్న ఉత్తమ్
- వీడియో బయటపెట్టిన హరీశ్ రావు
- 3వ తేదీ లోపు ఇవ్వాలన్నామంటున్న కాంగ్రెస్
- ఎన్నికల వేళ ఇస్తే ప్రలోభాలకు చాన్స్ ఉందని వివరణ
- హస్తం పార్టీ దిష్టిబొమ్మలు కాలవెట్టాలన్న కేటీఆర్
- గతంలో మూడు గంటల కరెంటు వ్యాఖ్యల కలకలం
హైదరాబాద్: కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల మంటలు చెలరేగుతున్నాయి. రైతుబంధును నవంబర్ 3వ తేదీ లోపు పంపిణీ చేయాలని నిన్న కాంగ్రెస్ నేతలు ఈసీని కలిసి విజ్ఞప్తి చేసినట్టు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క ఇవాళ ఢిల్లీలో మీడియాకు చెప్పారు. దీనిపై బీఆర్ఎస్ ఒంటికాలిపై లేచింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో చేసిన కామెంట్లను తెరమీదకు తెచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోలను మంత్రి హరీశ్ రావు మీడియాకు విడుదల చేశారు.
‘రైతుబంధు పథకం అనేది ఫార్మర్స్ ఇన్ పుట్ సబ్సిడీ పథకం మొదలు పెట్టాడు.. ఆశ్చర్యకరంగా తెలంగాణ ప్రజల అమూల్య సొమ్ము, పన్నుల ద్వారా కట్టే పైసలను దుబారా చేస్తున్న విషయాన్ని గమనించాలి.’అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను మంత్రి వినిపించారు. మరో వైపు మంత్రి కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాల నాయకులతో మాట్లాడారు. రైతుబంధు వద్దంటున్న కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మలను దహనం చేయాలని, ఊరూరా ఈ కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీ అని ప్రజలకు వివరించాలని సూచించారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆదేశించారు. గతంలో రేవంత్ రెడ్డి వ్యవసాయానికి మూడు గంటల కరెంటు చాలు అంటూ అమెరికాలో ఉన్న మాటలను మరోమారు వైరల్ చేసేందుకు బీఆర్ఎస్ సోషల్ మీడియా టీం యాక్టివ్ అయ్యింది. బీఆర్ఎస్ విమర్శలను తిప్పి కొట్టేందుకు కాంగ్రెస్ సైతం రంగంలోకి దిగింది. తాము రైతుబంధు వద్దని చెప్పలేదని, నవంబర్ 3వ తేదీ లోపలే ఖాతాల్లో జమచేయుమన్నామని వివరణ ఇచ్చింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత డబ్బులు ఖాతాల్లో వేయడం వల్ల ఓటర్లు ప్రభావితమయ్యే అవకాశం ఉందనే ఉద్దేశంతోనే ఈసీకి ఇలా విజ్ఞప్తి చేశామని చెప్పారు.
ఇదే అంశంపై ఎమ్మెల్సీ కవిత సైతం స్పందించారు. ఈ ఎన్నికలు రాహుల్ గాంధీ వర్సెస్ రైతన్న అన్నట్టుగా సాగుతున్నాయని చెప్పారు. రైతుబంధు మాత్రమే ఆపాలా..? పేదింటికి రేషన్ బియ్యం, వృద్ధులకు పింఛన్, అక్కలకు బీడీ పింఛన్, ఇంటింటికీ మిషన్ భగీరథ తాగునీరు, ఇండ్లకు, పరిశ్రమలకు 24 గంటల కరెంటు, షాదీముబారక్, కల్యాణ లక్ష్మి ఇవన్నీ ఎన్నికల కోడ్ పేరుతో ఆపేయాలా..? రాజీవ్ గాంధీ సమాధానం చెప్పాలంటూ ఫైర్ అయ్యారు.
కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు గంటల పాటు కరెంటు ఇవ్వకపోవడంతో రైతులు రోడ్డెక్కుతున్నారని, సబ్ స్టేషన్లలో మొసళ్లు వదిలి నిరసన తెలుపుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ విధానాలను ప్రజలకు విప్పి చెప్పాలని సూచించారు. మరో వైపు గాంధీ భవన్ లో పీసీసీ నాయకులు సైతం అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు.