మాకే టికెటివ్వండి..... బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఆశావహుల చివరి ప్రయత్నాలు

  • ప్రగతి భవన్​ పిలుపు కోసం పలువురి పడిగాపులు 
  • సిట్టింగులకే టికెట్లు ఇవ్వాలంటూ అనుచరుల ఆందోళనలు 
  • జనగామలో పల్లా, ముత్తిరెడ్డి మధ్య టికెట్ ఫైట్ 
  • కొత్తగూడెంలో వనమా, జలగం, హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు పోటాపోటీ 

మంత్రి కేటీఆర్ ​అమెరికా పర్యటనకు వెళ్లడంతో వీళ్లిద్దరి ద్వారా పార్టీ చీఫ్ ​కేసీఆర్​కు చెప్పించుకుని టికెట్​దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకొందరు నేతలేమో ప్రగతి భవన్​పిలుపు కోసం హైదరాబాద్​లోనే మకాం వేశారు. మరోవైపు తమ నాయకుడికే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల అనుచరులు ఆందోళనలు చేస్తున్నారు. సోమవారమే బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ విడుదల చేసే అవకాశం ఉండడంతో ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ లీడర్ల మీటింగ్​లు, ఆందోళనలు కొనసాగాయి. తమకే టికెట్​ఇవ్వాలని కొందరు, ఫలానా వాళ్లకు టికెట్​ఇవ్వొద్దని ఇంకొందరు లాబీయింగ్ చేశారు. 

ఒక్కటైన బొంతు, భేతి

ఉప్పల్​ఎమ్మెల్యే టికెట్​కోసం ఇన్నాళ్లు ఉప్పునిప్పులా ఉన్న జీహెచ్ఎంసీ మాజీ మేయర్​బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే భేతి సుభాష్​రెడ్డి ఇప్పుడు ఒక్కటయ్యారు. తెలంగాణ ఉద్యమకారులైన తమలో ఎవరో ఒకరికి టికెట్​ఇవ్వాలని వాళ్లు కోరుతున్నారు. తమను కాదని కాంగ్రెస్​నుంచి వచ్చిన లీడర్​కు టికెట్​ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. తమలో ఎవరికి టికెట్​ఇచ్చినా కలిసి పని చేసి, పార్టీని గెలిపిస్తామని చెబుతున్నారు. ఆదివారం ఈ ఇద్దరూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆమె నివాసంలో కలిశారు. ఉద్యమకారులకే టికెట్​ఇచ్చేలా పార్టీ చీఫ్​కేసీఆర్ ను ఒప్పించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన కవిత.. విషయం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. కాగా, ఉప్పల్​ టికెట్​బండారు లక్ష్మారెడ్డికి ఖరారైనట్టు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై పార్టీ నుంచి క్లారిటీ రాలేదు. 

 ముథోల్​లో సిట్టింగ్​ఎమ్మెల్యే విఠల్​రెడ్డికి చాన్స్​దక్కకపోవచ్చని ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన హైదరాబాద్​లోనే మకాం వేసి, మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి ద్వారా టికెట్​కోసం లాబీయింగ్​చేస్తున్నారు. విఠల్​రెడ్డికే టికెట్​ఇప్పించే ప్రయత్నాల్లో మంత్రి ఉన్నట్టు తెలిసింది. 
ఖానాపూర్​ఎమ్మెల్యే రేఖానాయక్​ను తప్పించి, అక్కడి నుంచి కేటీఆర్ ​క్లాస్​మేట్​భూక్యా జాన్సన్​నాయక్​కు టికెట్​ఖరారు చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. దీంతో రేఖానాయక్ ​మంత్రి హరీశ్​రావు ద్వారా టికెట్​కోసం లాబీయింగ్​ చేస్తున్నారు. రేఖానాయక్​ అనుచరులు ఆదివారం ఉస్మానియా వర్సిటీలోని ఆర్ట్స్​కాలేజీ వద్ద ఆందోళనకు దిగారు. స్థానికేతరుడు అయిన జాన్సన్​కు టికెట్​ఇవ్వొద్దని డిమాండ్​చేశారు. 

జనగామ టికెట్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​రెడ్డికే ఇస్తారనే ప్రచారంతో సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల ప్రగతి భవన్​లో కేసీఆర్​ను కలిసేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో ఆదివారం సూర్యాపేట పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్​ను ముత్తిరెడ్డి కలిశారు. తనకే టికెట్​ఇవ్వాలని కోరారు. 
  స్టేషన్ ఘన్​పూర్ టికెట్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరికే ఖరారైనట్టుగా ప్రచారం జరుగుతోంది. ఆదివారం ఉదయం ఎమ్మెల్యే రాజయ్య, కడియం శ్రీహరిని కేసీఆర్ ప్రగతి భవన్​కు పిలిపించి మాట్లాడినట్టు తెలిసింది. 

   వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ ను తప్పించి మాజీ ఎమ్మెల్యే మదన్​లాల్​కు టికెట్​ఇస్తారని ప్రచారం జరుగుతోంది. రాములు నాయక్​ మూడ్రోజులుగా హైదరాబాద్​లోనే మకాం వేసి, ఎమ్మెల్సీ తాతా మధు సహకారంతో టికెట్​కోసం ప్రయత్నిస్తున్నారు. మంత్రి పువ్వాడ అజయ్ మాత్రం​మాజీ ఎమ్మెల్యే మదన్​లాల్​వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది. కాగా, మదన్ లాల్ ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు సోషల్​మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 
జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావుకు టికెట్​దక్కకపోవచ్చని ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన వారం రోజులుగా హైదరాబాద్​లోనే మకాం వేశారు. ఇప్పటికే మంత్రి కేటీఆర్ ను కలిశారు. మంత్రి హరీశ్ రావు క్యాంప్ ఆఫీసుల చుట్టూ చక్కర్లు కొడ్తున్నారు. ఇద్దరు మంత్రులకు సన్నిహితంగా ఉండే ఇతర నాయకులు, క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందిన పెద్దలతో టికెట్ కోసం ఒత్తిడి చేయిస్తున్నట్లు తెలిసింది. ఇదే టికెట్​పై ఢిల్లీ వసంత్​ఆశలు పెట్టుకున్నారు. తాను చేసిన సామాజిక సేవ కార్యక్రమాలను గుర్తించి టికెట్​ఇవ్వాలని ఆయన పార్టీ పెద్దలను కోరుతున్నారు.

   మెదక్​ టికెట్​ మైనంపల్లి రోహిత్​కు ఇవ్వాలని కోరుతూ ఆయన అనుచరులు ఆదివారం మెదక్​లో రాస్తారోకో చేశారు. పద్మా దేవేందర్​రెడ్డిని తప్పించి, రోహిత్​కే టికెట్​ఇవ్వాలని డిమాండ్​చేశారు.  
ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు టికెట్​కోసం చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. కేసీఆర్ రెండ్రోజుల కింద ఆయనను పిలిపించి, ఈసారి టికెట్ జెడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మికి ఇస్తున్నామని చెప్పినట్టు తెలిసింది. అయినా ఆత్రం సక్కు హైదరాబాద్ లోనే మకాం వేసి ఎమ్మెల్సీ దండే విఠల్, సీనియర్​నేత వేణుగోపాలాచారి ద్వారా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. 

   ఇల్లెందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ ఆదివారం మంత్రి హరీశ్​రావును కలిశారు. ఇల్లెందు కౌన్సిలర్లు, ఇతర నాయకులతో కలిసి హైదరాబాద్​కు వచ్చిన ఆమె.. తనకే టికెట్​ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. తనకు వ్యతిరేకంగా ఇల్లెందు మున్సిపల్​చైర్మన్​వెంకటేశ్వర్​రావుతో పాటు ఇతర నేతలు ప్రయత్నిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు హరిప్రియకు టికెట్​ఇవ్వొద్దని స్థానిక నాయకులంతా కలిసి పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేశారు. 
కొత్తగూడెం టికెట్​పై వనమా వెంకటేశ్వరరావు ఆందోళన చెందుతున్నారు. ఆయన సీఎం కేసీఆర్​ను కలిసేందుకు ఆదివారం హైదరాబాద్​కు చేరుకున్నారు. మరోవైపు కొత్తగూడెం సీటు ఆశిస్తున్న హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు ఆదివారం పట్టణంలో ‘గడప గడపకు గడల’ అనే కార్యక్రమంతో ఇంటింటి ప్రచారం మొదలు పెట్టారు. ఇంకోవైపు ఇటీవల వనమా ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో, టికెట్​తనకే వస్తుందనే ధీమాతో మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు కూడా ఉన్నారు. 
   కమ్యూనిస్టులతో పొత్తు లేకుంటే భద్రాచలం టికెట్​తనకే ఇవ్వాలని తెల్లం వెంకట్రావు కోరుతున్నారు. ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి ప్రగతి భవన్​కు వెళ్లిన ఆయన సీఎం కేసీఆర్​ను కలిశారు. మరోవైపు భద్రాచలం టికెట్​వెంకట్రావుకు ఇవ్వొద్దని నియోజకవర్గంలోని ఐదు మండలాల లీడర్లు, ప్రజాప్రతినిధులు ఆదివారం ప్రభుత్వ విప్​రేగా కాంతారావును కలిసి విజ్ఞప్తి చేశారు.
   నకిరేకల్​ టికెట్​చిరుమర్తి లింగయ్యకే ఇస్తుండడంతో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం పార్టీని వీడకుండా ప్రయత్నిస్తున్నారు. మంత్రి హరీశ్​రావు ఆయనను పిలిపించి మాట్లాడినట్టు తెలిసింది. ఎమ్మెల్సీ లేదా కార్పొరేషన్​ చైర్మన్​ పదవి ఇస్తామని హామీ ఇవ్వగా.. అవేవీ తనకు వద్దని, టికెట్ నే కావాలని వీరేశం కోరినట్టు సమాచారం. 

   కూకట్​పల్లి టికెట్​తనకే వస్తుందని బీఆర్ఎస్​సీనియర్​నాయకుడు గొట్టిముక్కల వెంకటేశ్వర్​రావు తన అనుచరులకు చెప్పారు. ఒకవేళ టికెట్​ఇవ్వకుంటే రెబల్​గా పోటీ చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. ఆదివారం కూకట్ పల్లిలోని ఓ హోటల్ లో తన అనుచరులతో వెంకటేశ్వర్​రావు సమావేశమయ్యారు. పదేండ్లుగా పార్టీ కోసం పని చేస్తున్నా, తనకు సముచిత స్థానం ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ మాధవరం కృష్ణారావు కే టికెట్​ఇస్తే 10 వేల మందితో నామినేషన్లు వేయిస్తానని పార్టీ నాయకత్వాన్ని హెచ్చరించారు. 2018లో మంత్రి కేటీఆర్​ హామీ ఇవ్వడంతోనే తాను పోటీ చేయలేదని, ఈసారి పోటీ చేసి తీరుతానని తేల్చి చెప్పారు.