అసూయ అతి భయంకరమైన వ్యాధి .. ఆ వ్యాధి ఉన్నవారు ఎదుటివారిపై ఇష్టానుసారంగా వ్యహరిస్తారు.. అనివార్యంగా అలాంటి వాళ్ల గురించి మళ్లీ మళ్లీ మాట్లాడాల్సి రావడమే విషాదం. మన రాష్ట్రంలో అలాంటి అనివార్యత కలిగిస్తున్న వారు బీఆర్ఎస్ నాయకులు. తాము అధికారంలో ఉన్నప్పుడు చేతికి అదుపు లేకుండా ఏం చేశారో ప్రభుత్వ సమీక్షల ద్వారా బయటకు వస్తున్నది. దీంతో వారి నోటికీ అదుపు లేకుండా పోయింది. ఎవ్వరంటే వాళ్లను. ఎంత అంటే అంతమాట అంటున్నారు. ఎవరిని ఎట్లా సంబోధించాలనే కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. వారిలో ప్రథములు కేటీఆర్. తాను విదేశాల్లో ఆంగ్ల మాధ్యమంలో ప్రావీణ్యం సంపాదించి వచ్చారని సెలవిస్తుంటారు ఆయన అనుయాయులు. బీఆర్ఎస్ పార్టీలో నెంబర్ టూ. మరి అలాంటి నాయకుడు మాటలు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి. ఎంత హుందాగా వ్యవహరించాలి. అవేమీ పట్టించుకోకుండా రాష్ట్ర ముఖ్యమంత్రిని...కనకపు సింహాసనంపై శునకం అంటూ పోల్చడం ఏ జ్జానం అనుకోవాలి. వీపులు పగుల్తాయని చెప్పడం ఏ అహంకారానికి ప్రతీక అనుకోవాలి?
అహంకారం వల్లే ఓటమి
తమ అహంకారం వల్లనే ఓటమి పాలయ్యామనే విషయాన్ని అస్సలు సమీక్షించుకున్నట్లు లేదు. ప్రజలున్నది కేవలం ఓట్లు వేయడానికి, తాము పాలించేందుకు ఉన్నామనే ధోరణి వల్లనే ప్రజలకు వారు దూరం అయ్యారు. కుర్చీ దిగిపోయిన తర్వాత దిగాలు పడిపోతున్నారు. ఓ వైపు ప్రజలను. ప్రజాపాలన అందిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైనా ఆరోపణలు చేస్తున్నారు. స్థాయికి మించి మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రమే తమ సొత్తు అనే భావనతో ఉన్న వారికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. గిలగిలా కొట్టుకుంటున్నారు. దానికితోడు వారు చేసిన అర్థిక అక్రమాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాల గురించి సమీక్షల సవివర సారాంశాలు ప్రజలకు తేటతెల్లం అవుతున్నాయి. తాము నిర్మించుకున్న మాయ పొరలు తొలగడంతో తట్టుకోలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. కడుపు ఉబ్బరంతో వారసత్వంగా వస్తుందనుకున్న పదవి పోవడంతో ఏమీ తోచడం లేదు. అందుకే కేసీఆరే త్వరలో మరోసారి సీఎం అవుతారని చెప్పుకుంటున్నారు. ప్రజలకంటే వారికి పదవులే ముఖ్యమనే విషయాన్ని వారికివారే చెప్పుకుంటున్నారు. అయినా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 70 వేలకు పైగా పుస్తకాలు చదివారని చెప్తుంటారు. ఏ స్థాయి వ్యక్తులతో ఎట్లా మాట్లాడాలో ఆయన కూడా మీకు సరిగ్గా చెప్పలేనట్లుంది. ఇతర దేశాల్లో చదువుకుని వచ్చిన మీరు కూడా దాని గురించి అస్సలు పట్టించుకోనట్లే ఉంది.
మేం కూడా చురకలు వేయగలం
బహుభాషలు తెలిసిన నాయకులని చెప్పుకుంటే మీలాంటివారు కూడా గౌరవం మరచి మాట్లాడితే ఏమనుకోవాలి. అదే మీస్థాయి అని సరిపెట్టుకోవాలా. లేకపోతే మీస్థాయికి దిగి మాట్లాడాలా?. అనే సందేహాలు కూడా సహజంగానే వస్తాయి. పదేండ్లపాటు పదవిలో ఉన్నారు. అంతకుముందు అమెరికాలో ఉన్నారు. ఆ తర్వాత ఉద్యోగమూ చేశారు. మీకు కూడా చాలానే అనుభవాలున్నాయి. అన్ని అనుభవాలు ఉండి కూడా మీరు చాలా చులకనగా ముఖ్యమంత్రిని మాట్లాడుతున్నారంటే... నడిమంత్రపు సిరితో విర్రవీగడంగా భావించేలా ఉంది. కాబట్టి సమయం, సందర్భాన్ని బట్టి పరిస్థితులను బట్టి మన మాటతీరు సందర్భోచితంగా ఉండాలి. నోరు బాగుంటే అంతా బాగున్నట్లే. అయినా మీకున్నంత భాషా జ్జానం ఇతరులకు లేకపోవచ్చు. మాకు తెలిసినంతలో మేము కూడా కొన్ని మాటలు అనగలం. కొన్ని చురకలు వేయగలం. ‘ఎవరు తవ్విన గుంతలో వాళ్లే పడ్తరు’. ‘చెప్పినా వినని వాడిని చెడంగా చూడాలి’. ఇలాంటి తెలుగు జాతీయాలను, సామెతలను మేము కూడా చాలా అద్భుతంగా వాడగలం. అంతే కాదు. ‘అల్పుడెప్పుడు పల్కు ఆడంబరముగాను’’ అని కూడా రాగయుక్త పద్యాలు కూడా పాడగలం. ఎవరిని ఎట్లా గౌరవించాలో మాకు తెలుసు కాబట్టి ఆచితూచి మాట్లాడాలని అనుకుంటాం. ఎదుటివారు కూడా అట్లాగే ఉండాలని భావిస్తాం. అయినా మేము ఇంతే.. అని మీరు భావిస్తే మీ ఇష్టం. ప్రజలు ఇప్పటికే మిమ్మల్ని ప్రతిపక్షానికి పరిమితం చేశారు. పెద్దంతరం, చిన్నంతరం తెలుసుకునిమాట్లాడాలని సూచన.
ప్రజాతీర్పు తప్పు పడుతున్నారు
తెలంగాణ రాష్ట్రం వస్తే తాను కావలి కుక్కలా ఉంటానని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ఆయన ఆ విషయం మర్చిపోయారు. అంతే కాదు రాళ్లతో తనను కొట్టాలనీ సెలవిచ్చారు. ఆయన గురించి అవేవీ మనస్సులో పెట్టుకోకుండా ప్రజలు ఓటుతో పక్కకు నెట్టేశారు. అంతే ప్రతిపక్షంలో కూర్చున్నారు. అయినా ఎవరు ఏ సింహాసనంపై కూర్చుంటే ప్రజలు తిరస్కరించాలో వారే అర్థం చేసుకోవాలి. ఆలోచించుకోవాలి. అంతే కాదు ప్రజలు తమకు ఓట్లే వేయలేదు కాబట్టి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలని కూడా చెప్పారు. తమకు ఓట్లేయని ప్రజలదే తప్పని ఈ దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ అనలేదు. ఏ నాయకుడూ ఇట్లా అనేందుకు సాహసించలేదు. ఎందుకంటే ప్రజల తీర్పు చాలా గొప్పది. దానికి తిరుగులేదు. ఇంగితం ఉన్నవారు ఎవ్వరూ ప్రజలను దోషులను చేయరు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి అంతులేని అక్కసును వెళ్లగక్కుతున్నారు. నోటికి ఎంతవస్తే అంతమాట అనేస్తున్నారు.
- బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి, అధ్యక్షుడు,తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక