వరంగల్/హనుమకొండ, వెలుగు: కేంద్రంలో హంగ్ వస్తే బీఆర్ఎస్ పార్టీనే కీలకం అవుతుందని ఆ పార్టీ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి 200 సీట్లు దాటే పరిస్థితి లేదన్నారు. ‘‘రాష్ట్రంలో 14, 15 ఎంపీ సీట్లు గెలిస్తే.. కేంద్రంలో హంగ్ వస్తే మనమే కీలక పాత్ర పోషిస్తాం. అప్పుడు రాష్ట్రం కోసం పేగులు తెగేదాకా కొట్లాడేది బీఆర్ఎస్సే” అని ఆయన చెప్పారు. బీఆర్ఎస్ వరంగల్ అభ్యర్థి డాక్టర్ మారపెల్లి సుధీర్ కుమార్ కు మద్దతుగా ఆదివారం హనుమకొండలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో కేసీఆర్ మాట్లాడారు. గోదావరి, కృష్ణా జలాలను కాపాడుకోవాలన్నా, తెలంగాణకు నిధులు రాబట్టుకోవాలన్నా, ప్రాజెక్టులకు జాతీయ హోదా రావాలన్నా, నిరుద్యోగ సమస్య తీరాలన్నా, మన బతుకులు బాగుపడాలన్నా.. బీఆర్ఎస్ అభ్యర్థులే గెలవాలని, అదే తెలంగాణకు క్షేమమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయ ప్రయోజనాల కోసం గోదావరి జలాలను కర్నాటక, తమిళనాడుకు ఇచ్చే కుట్ర చేస్తున్నారని.. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి నోరు విప్పకపోవడం వెనక ఆంతర్యం ఏమిటో చెప్పాలన్నారు. మోదీ పాలనలో అచ్ఛేదిన్ రాలేదని.. సచ్చే దిన్ వచ్చిందన్నారు. కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదని, గిరిజన యూనివర్సిటీకి మాత్రం ఎలక్షన్ల ముందు కాగితం ఇచ్చారన్నారు. దేశంలో18 లక్షల ఖాళీలు ఉంటే.. ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదన్నారు.
కాళేశ్వరం నీళ్లతో పసిడి పంటలు
సీఎం రేవంత్ రెడ్డి చిత్రవిచిత్రమైన మాటలు మాట్లాడుతున్నారని, వరంగల్ జిల్లాకు కాళేశ్వరం నీళ్లే రాలేదంటున్నారని కేసీఆర్ మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో నర్సంపేట, భూపాలపల్లి, మహబూబాబాద్, పాలకుర్తి, వర్ధన్నపేట తదితర ప్రాంతాలకు నీళ్లొచ్చి పసిడి రాసుల్లాంటి పంటలు పండాయన్నారు. రేవంత్ రెడ్డికి తెలంగాణ చరిత్ర, భూగోళం తెల్వదన్నారు. కాంగ్రెస్ అడ్డగోలు హామీలు చూసి మోసపోయి ఓటేశారని.. ఇప్పుడు ఏరికోరి మొగన్ని తెచ్చుకుంటే.. ఎగిరెగిరి తన్నినట్టుగా ఉందన్నారు. ‘‘కరెంట్, సాగునీళ్లు ఎక్కడబోయాయి? పంటలు ఎందుకు ఎండుతున్నయ్? మంచినీళ్ల కరువు ఎందుకొస్తున్నది? గత పదేండ్లలో ఇవన్నీ ఉండేనా?’’ అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఒక్క హామీ కూడా అమలు చేయలేదన్నారు. ‘‘హామీల గురించి అడిగితే సీఎం రేవంత్ రెడ్డి గుడ్లు తీసి గోలీలాడుకుంటా.. పేగులు తీసి మెడలో వేసుకుంట.. చెడ్డీ కూడా గుంజుకుంట.. చర్లపల్లి జైలులో వేస్త అంటున్నడు. ఈ జైళ్లు, తోకమట్టలకు భయపడతనా? కేసీఆర్ జైళ్లకు భయపడి ఉంటే తెలంగాణ వచ్చేదా? పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా నా నోట అలాంటి మాటలు విన్నరా?” అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పడిపోయిందని, బిల్డింగ్ పర్మిషన్లు కావాలంటే కాంగ్రెస్ పార్టీకి లంచాలు ఇవ్వాలంటున్నారని ఆరోపించారు.
స్టేషన్ ఘన్ పూర్కు మూడు నెలల్లోనే బై ఎలక్షన్
కడియం శ్రీహరి బీఆర్ఎస్ను మోసం చేసి రాజకీయ జీవితాన్ని శాశ్వతంగా సమాధి చేసుకున్నారని కేసీఆర్ అన్నారు. 3 నెలల్లోనే స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గానికి బై ఎలక్షన్ వస్తుందని, తాటికొండ రాజయ్య ఎమ్మెల్యే కాకతప్పదని అన్నారు. ద్రోహులకు అదే గుణపాఠం అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం ఇంకా మిగిలే ఉందని, ఆ దిశగా వెళ్లాలంటే వరంగల్ గడ్డ మీద గులాబీ జెండా ఎగురవేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, చల్లా ధర్మారెడ్డి, తాటికొండ రాజయ్య, గండ్ర వెంకట రమణారెడ్డి, నన్నపనేని నరేందర్ తదితరులు పాల్గొన్నారు.