హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలకు నిరసనగా మాసబ్ ట్యాంక్ లోని సంక్షేమ భవన్ పై బీఆర్ఎస్వీ కార్యకర్తలు దాడి చేశారు. బుధవారం మధ్యాహ్నం సంక్షేమ భవన్ ఔట్ గేట్ నుంచి బీఆర్ఎస్వీ ప్రెసిడెంట్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో సుమారు 30 మంది లోపలికి వచ్చి భవన్ ఎంట్రన్స్‌లో అద్దాలు ధ్వంసం చేశారు. భవన్ పైకి వెళ్లేందుకు ప్రయత్నించగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు..
అనంతరం భవన్ ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గురుకులాలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని, కాంట్రాక్టర్లు నాణ్యమైన ఫుడ్ అందించటం లేదని గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. నిరసనతో మాసబ్ ట్యాంక్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీడియోలు, ఫొటోల ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.