జగిత్యాలలో వృద్ధుడు దారుణ హత్య

జగిత్యాలలో వృద్ధుడు దారుణ హత్య
  • ఆస్తి కోసం కత్తి తో పొడిచి, పెట్రోల్  పోసి నిప్పంటించి హత్య చేసిన కొడుకులు, కూతురు, అల్లుడు 
  • జగిత్యాల జిల్లా పొలాస గ్రామంలో ఘటన

జగిత్యాల రూరల్, వెలుగు: ఆస్తి కోసం కుటుంబసభ్యులే  వృద్ధుడిని కత్తితో పొడిచి, పెట్రోల్  పోసి నిప్పంటించి దారుణంగా హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

జగిత్యాల రూరల్  మండలం పోలాస గ్రామానికి చెందిన కమలాకర్(60) వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన లలిత, జమున అనే అక్కాచెల్లెళ్లను పెండ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉండగా, అందరికీ పెళ్లిళ్లు చేయడంతో ఎవరికి వారే బతుకుతున్నారు. 

ఐదేండ్లుగా ఇద్దరు భార్యలు దూరంగా ఉండడంతో కమలాకర్  వేరే రాష్ట్రానికి చెందిన మరో మహిళను పెండ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో కొన్ని రోజులుగా అస్తి పంపకాల విషయంలో గొడవలు జరగడంతో శనివారం కొడుకులు పడాల రంజిత్, పడాల చిరంజీవి, కూతురు శిరీష, అల్లుడు శోభన్ బాబు ఇంటికి వెళ్లి కమలాకర్ తో గొడవ పడ్డారు. 

అనంతరం కత్తితో దాడి చేసి, పెట్రోల్  పోసి నిప్పంటించారు. స్థానికులు బాధితుడిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ చనిపోయాడు. మృతుడి తమ్ముడు రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్  ఎస్సై సధాకర్  తెలిపారు.