
- పాత కక్షల నేపథ్యంలో యువకుడి హత్య
- మొదట కారుతో ఢీ కొట్టి.. తర్వాత గొడ్డళ్లు, కొడవళ్లతో దాడి..
- మృతుడి తలలోనే ఇరుక్కుపోయిన గొడ్డలి..
- పోస్టుమార్టం సమయంలో తొలగించిన వైద్యులు
- పోలీసుల అదుపులో నిందితులు
ఎల్బీనగర్, వెలుగు:హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ పరిధిలో దారుణం జరిగింది. స్నేహితుడిని తోటి స్నేహితులే కిరాతకంగా హత్య చేశారు. పాత కక్షల నేపథ్యంలో ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కారుతో ఢీ కొట్టి కింద పడగానే గొడ్డళ్లు, వేట కొడవళ్లతో విచక్షణారహితంగా దాడి చేసి చంపేశారు. హైదరాబాద్ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌పరిధిలో శనివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ఎల్బీనగర్ పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం వెలిశాలకు చెందిన బొడ్డు మహేశ్ (31) తన తల్లి చంద్రమ్మ, భార్య శ్రావణితో కలిసి ఎల్బీనగర్లోని ఎన్టీఆర్ నగర్ లో ఉంటున్నాడు.
ఇతనిపై పలు పోలీస్ స్టేషన్లల్లో కేసులు ఉన్నాయి. మహేశ్, గతంలో ఎన్టీఆర్ నగర్ లో నివాసం ఉండే పగిళ్ల పురుషోత్తం(29) మంచి స్నేహితులు. 2023లో రంగారెడ్డి జిల్లా తట్టిఅన్నారంలో జరిగిన పెళ్లి ఊరేగింపునకు హాజరయ్యారు. అక్కడ ఇద్దరూ గొడవపడ్డారు. ఈ క్రమంలో మహేశ్‌పై బీరు బాటిల్‌తో పురుషోత్తం దాడి చేశాడు. ఈ సంఘటనలో తలకు గాయాలైన మహేశ్.. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పురుషోత్తంపైన హత్యాయత్నం కేసు నమోదైంది.
ఈ కేసు కోర్టులో నడుస్తున్నది. అయితే మధ్యలో స్నేహితులని పెట్టి రాజీ కోసం మాట్లాడుకున్నారు. రాజీ పడేందుకు మహేశ్ 2024 డిసెంబర్ 20న హయత్ నగర్ కోర్టుకు రావాల్సి ఉంది. అయితే, అతడు కోర్టు రాకుండా తాను సూర్యాపేటలో ఉన్నానంటూ కోర్టు కానిస్టేబుల్ కు చెప్పి.. తనపై దాడి చేసిన పురుషోత్తం హత్యకు ప్లాన్ వేశాడు.
పక్కా స్కెచ్ ప్రకారం..
నిరుడు డిసెంబర్ 20 తేదీన కొత్తపేట-– నాగోలు రోడ్డులో ఉన్న అమరావతి వైన్స్ వద్ద పురుషోత్తం ఉన్నాడనే సమాచారంతో మహేశ్తన స్నేహితులైన బెల్లి భరత్, దాసరి సురేందర్‌తో అక్కడికి చేరుకున్నాడు. పురుషోత్తంపై వేట కొడవలితో దాడికి యత్నించాడు. అయితే పురుషోత్తం తప్పించుకున్నాడు. ఈ ఘటనలో పురుషోత్తం స్నేహితులైన గడ్డమోయిన రాము, పాశం నాగరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. పురుషోత్తం ఫిర్యాదుతో చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేశారు. దాడికి పాల్పడిన బొడ్డు మహేశ్, బెల్లి భరత్, దాసరి సురేందర్, సుమన్, గౌతమ్ కుమార్, పరుశురాంను అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించారు.
జైలుకు వెళ్లిన మహేశ్, అతడి స్నేహితులు ఇటీవల బయటికి వచ్చారు. అయితే, తనను ఎక్కడ హత్య చేస్తాడోననే భయంతో పురుషోత్తం.. అతడి స్నేహితులతో కలిసి మహేశ్ హత్యకు స్కెచ్‌వేశాడు. కొన్ని రోజులుగా మహేశ్కదలికలపై ఫ్రెండ్స్‌తో కలిసి నిఘా పెట్టాడు. శనివారం అర్ధరాత్రి తర్వాత మహేశ్తన ఇద్దరు స్నేహితులతో కలిసి బైక్ పై ఎల్బీనగర్ శివగంగ కాలనీ నుంచి ఇంటికి వెళ్తుండగా.. అప్పటికే మాటు వేసిన పురుషోత్తం, అతని ఫ్రెండ్స్ వెంబడించారు. మహేశ్బైక్ను ఢీకొట్టారు.
లేచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న మహేశ్‌పై గొడ్డళ్లు, వేట కొడవళ్లతో విచక్షణారహితంగా దాడి చేసి, అక్కడి నుంచి పారిపోయారు. మహేశ్వెంట ఉన్న స్నేహితులు అక్కడ నుంచి పారిపోయి స్థానికులకు, ఎల్బీనగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. తీవ్రంగా గాయపడిన మహేశ్‌ను 108లో కామినేని హాస్పిటల్ కు తరలించారు. డాక్టర్లు పరిశీలించి, మృతి చెందినట్టు తెలిపారు.
మృతుడి తలలో ఇరుక్కుపోయిన గొడ్డలి
మహేశ్ తలపై నిందితులు గొడ్డలితో బలంగా నరకడంతో.. అది తలలోనే ఇరుక్కుపోయింది. దవాఖానలో వైద్యులు తీసే ప్రయత్నం చేసినా.. బయటకురాలేదు. అనంతరం పోలీసులు మృతదేహాన్ని ఆదివారం పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. మృతుడి చెల్లెలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.తన కొడుకును హత్య చేయించింది ఆర్కేపురం డివిజన్ కు చెందిన ఓ పార్టీ నాయకుడు అని మహేశ్ తల్లి చంద్రమ్మ పోలీస్ స్టేషన్ లో మీడియా ముందు ఆరోపించారు.
ఈ విషయం తెలుసుకున్న ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్, ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్య, ఎల్బీనగర్ సీఐ వినోద్‌కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మహేశ్‌ను హత్య చేసిన నిందితులు పగిల్ల పురుషోత్తం, తుకరాంగేట్ కు చెందిన గాదమోని రాము, భరత్ నగర్ కు చెందిన మంద సందీప్, నోముల నాగార్జునను ఎల్బీనగర్ పోలీసులు అరెస్టు చేసి, విచారిస్తున్నారు. వీరితోపాటు ఈ హత్యలో ఎంత మంది ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.