- పోలీసుల అదుపులో సైకో నిందితుడు
- గ్యాంగ్ రేప్ చేశారని పేరెంట్స్ ఆరోపణ
- హాస్పిటల్లో తేజశ్రీ పరిస్థితి అడిగి తెలుసుకున్న సీపీ సత్యనారాయణ
- నిందితులకు శిక్షపడేలా ఫాస్ట్‌ట్రాక్ కోర్టు కోరతామని వెల్లడి
- బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్న ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్
నిజామాబాద్, వెలుగు: ప్రేమ పేరుతో వంచించిన ఓ యువకుడు పాశవికంగా దాడి చేయడంతో బ్రెయిన్‌డెడ్ అయిన తేజశ్రీ (21) అనే యువతి వెంటిలేటర్‌పై చావుబతుకులతో పోరాడుతోంది. బాధితురాలిని బతికించడానికి డాక్టర్లు శ్రమిస్తున్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలోని జక్రాన్‌పల్లిలో శనివారం రాత్రి జరిగిన ఈ దారుణ ఘటన సోమవారం బయ టకు వచ్చింది. యువతిని నమ్మించి దాడి చేసిన యువకుడు తోఫిక్ మద్యం, గంజాయి మత్తుకు అలవాటుపడిన సైకోగా పోలీసులు అంచనాకు వచ్చారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
ప్రేమ పేరుతో నాలుగేండ్లుగా సావాసం..
తోఫిక్ జక్రాన్పల్లిలోని చికెన్ షాపులో పనిచేస్తూ ఎప్పుడూ మద్యం, గంజాయి మత్తులో ఉండేవాడు. అదే గ్రామానికి చెందిన పేద కుటుంబానికి చెందిన తేజశ్రీకి ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. నాలుగేండ్లుగా సన్నిహితంగా ఉండడంతో పెండ్లి చేసుకుంటారని గ్రామస్తులు భావించారు. కానీ, మతం మారితే తప్ప పెండ్లి చేసుకోనని తోఫిక్ స్పష్టం చేయడంతో 15 రోజుల నుంచి తేజశ్రీ అతన్ని దూరం పెట్టింది.
ఫోన్లో కూడా మాట్లాడడం లేదు. దీంతో శనివారం రాత్రి 9 గంటలకు తేజశ్రీ ఇంటికి వచ్చిన తోఫిక్ చివరిసారిగా ఓసారి మాట్లాడే పని ఉందని నమ్మించి బైక్‌పై బయటకు తీసుకెళ్లాడు. అక్కడ ఏం జరిగిందో తెలియదుగానీ బైక్‌పై నుంచి తేజశ్రీ పడిపోయిందని చెప్పి అదే రోజు రాత్రి 11 గంటల సమయంలో అపస్మారక స్థితిలో ఉన్న యువతిని ఇంటి ముందు వదిలేసి జారుకున్నాడు. పేరెంట్స్ ఆమెను మొదట ఆర్మూర్‌లోని ప్రైవేటు హాస్పిటల్‌కు తీసుకెళ్లగా అక్కడి డాక్టర్లు నిజామాబాద్‌కు రెఫర్ చేశారు. దీంతో సోమవారం తేజశ్రీని జీజీహెచ్ లో చేర్పించారు. బ్రెయిన్ డెడ్ కారణంగా కోమాలోకి వెళ్లిన ఆమెను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో నిందితుడు తోఫిక్ను జక్రాన్‌పల్లి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అతడి నుంచి నిజాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.
తోఫిక్ ఒక సైకో : సీపీ సత్యనారాయణ
తోఫిక్ సైకోలా ప్రవర్తించేవాడన్న విషయం తమ విచారణలో తేలిందని పోలీస్ కమిషనర్ సత్యనారాయణ తెలిపారు. ఘటన జరిగిన రోజు ఊరిలో ని సీసీ కెమెరాలు, ఇతర టెక్నికల్ అంశాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. సోమవారం సాయంత్రం జక్రాన్‌పల్లి వెళ్లిన సీపీ యువతి ఉంటున్న కాలనీవాసులతో మాట్లాడారు. బైక్‌పై నుంచి కింద పడిందని తోఫిక్ చెబుతున్నా ఇతరత్రా అనుమానాలు ఉన్నాయన్నారు. ఘటనలో ఎంత మంది హస్తం ఉందనే విషయాన్ని తేలుస్తామన్నారు. తోఫిక్పై హత్యాయత్నం కేసు నమోదు చేశామన్నారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయించి కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు. ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణంగా భావిస్తున్నామని లవ్ జిహాద్ ఆధారాల్లేవన్నారు. ఏసీపీ కిరణ్‌కుమార్, డిచ్పల్లి సీఐ కృష్ణ నేతృత్వంలో కేసు దర్యాప్తు చేస్తామన్నారు. అంతకు ముందు కమిషనర్ జీజీహెచ్ వెళ్లి బెడ్‌పై అచేతనంగా పడి ఉన్న తేజశ్రీని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గ్యాంగ్‌రేప్ చేసిన నిందితులను శిక్షించాలని యువతి పేరెంట్స్ ఆయనను కోరారు. ఘటనను తీవ్రంగా పరిగణించాలని ఎమ్మార్పీఎస్ నాయకులు సీపీకి విజ్ఞప్తి చేశారు.
సీఎం కేసీఆర్ దృష్టి తీసుకెళతా
ఘటన అత్యంత బాధాకరమని రూరల్ ఎమ్మెల్యే జాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. హాస్పిటల్ వచ్చిన ఆయన యువతి పరిస్థితి తెలుసుకుని ఆమె తల్లిదండ్రులను ఓదార్చారు. తేజశ్రీ కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళతానన్నారు. నిందితులకు కఠిన శిక్షపడేలా చూస్తామన్నారు.
- ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్