హనుమకొండలో దారుణహత్య..ఓ ఆటో డ్రైవర్‌‌పై కత్తితో దాడి చేసిన మరో ఆటోడ్రైవర్‌‌

హనుమకొండలో దారుణహత్య..ఓ ఆటో డ్రైవర్‌‌పై కత్తితో దాడి చేసిన మరో ఆటోడ్రైవర్‌‌
  • వివాహేతర సంబంధమే కారణమని గుర్తింపు

హనుమకొండ, వెలుగు : వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ ఆటో డ్రైవర్‌‌ మరో ఆటోడ్రైవర్‌‌ను కత్తితో పొడిచి చంపేశాడు. ఈ ఘటన హనుమకొండ అదాలత్‌‌ జంక్షన్‌‌ సమీపంలో బుధవారం పట్టపగలు నడిరోడ్డుపై జరిగింది. స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రేటర్‌‌ వరంగల్‌‌ పరిధిలోని మడికొండకు చెందిన మాచర్ల రాజ్‌‌కుమార్‌‌ (38) ఆటోడ్రైవర్‌‌గా పనిచేస్తున్నాడు. ఇతడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. మడికొండకే చెందిన ఓ మహిళ భర్త కొంతకాలం కింద చనిపోగా ఆమెతో.. అదే గ్రామానికి చెందిన మరో ఆటోడ్రైవర్‌‌ ఏనుగు వెంకటేశ్వర్లు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. 

సదరు మహిళతో మాచర్ల రాజ్‌‌కుమార్‌‌ సైతం సన్నిహితంగా ఉంటున్నాడు. ఈ విషయంపై వెంకటేశ్వర్లు కొన్ని రోజుల కింద రాజ్‌‌కుమార్‌‌ను నిలదీయడంతో ఇద్దరి మధ్య మాటామాట పెరిగి గొడవ జరిగింది. దీంతో కక్ష పెంచుకున్న వెంకటేశ్వర్లు ఎలాగైనా రాజ్‌‌కుమార్‌‌ను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా ఓ కత్తిని తన ఆటోలో పెట్టుకొని తిరుగుతున్నాడు. బుధవారం ఉదయం 11 గంటల టైంలో రాజ్‌‌కుమార్‌‌ తన ఆటోలో హనుమకొండ అదాలత్‌‌ జంక్షన్‌‌ నుంచి సుబేదారి వైపు వెళ్తున్నాడు. అతని వెనకే వచ్చిన వెంకటేశ్వర్లు తన ఆటోతో రాజ్‌‌కుమార్‌‌ ఆటోను ఢీకొట్టాడు. 

దీంతో రాజ్‌‌కుమార్‌‌ వెంకటేశ్వర్లతో గొడవకు దిగాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాట పెరగగా.. వెంకటేశ్వర్లు తన వెంట తెచ్చుకున్న కత్తితో రాజ్‌‌కుమార్‌‌పై దాడి చేశాడు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే కడుపు, ఛాతి భాగంలో పొడిచాడు. స్థానికులు ఆపే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. తీవ్రంగా గాయపడ్డ రాజ్‌‌కుమార్‌‌ అక్కడే కుప్పకూలాడు. 

స్థానికులు 108లో వరంగల్‌‌ ఎంజీఎంకు తరలించగా పరీక్షించిన డాక్టర్లు అప్పటికే చనిపోయినట్లు చెప్పారు.  వెంకటేశ్వర్లును స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు. మృతుడు రాజ్‌‌కుమార్‌‌ భార్య సరిత ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.