ఆర్మూర్​లో అక్కా చెల్లెళ్ల దారుణ హత్య

నిద్రపోతున్న వృద్ధులను కొట్టి చంపిన దుండగులు
10 తులాల బంగారు నగలతో పరార్
అగ్ని ప్రమాదంగా చిత్రీకరించేందుకు విఫలయత్నం
మంటలను గమనించి ఆర్పివేసిన స్థానికులు 
ఆర్మూర్, వెలుగు:
నిజామాబాద్​జిల్లా ఆర్మూర్​లో ఇంట్లో నిద్రపోతున్న అక్కా చెల్లెళ్లను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా కొట్టి చంపారు. వారి ఒంటిపై ఉన్న దాదాపు 10 తులాల బంగారు నగలను ఎత్తుకెళ్లారు. పోతూపోతూ ఫైర్ ​యాక్సిడెంట్​గా చిత్రీకరించేందుకు ఇంట్లో నిప్పు పెట్టారు. ఇన్​చార్జ్​సీపీ ప్రవీణ్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్మూర్​లోని సంతోష్​నగర్ కాలనీకి చెందిన మగ్గిడి రాజవ్వ(72), గంగవ్వ(62) సొంత అక్కా చెల్లెళ్లు. రాజవ్వకు పెండ్లి అయిన కొద్దిరోజుకే భర్త వదిలేసి వెళ్లగా, గంగవ్వ భర్త 20 ఏండ్ల కింద చనిపోయాడు. దీంతో అక్కాచెల్లెళ్లు ఒకే ఇంట్లో ఉంటున్నారు. గంగవ్వకు శ్రీనివాస్, మహిపాల్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. మహిపాల్​స్థానికంగా వేరే ఇంట్లో ఉంటుండగా, శ్రీనివాస్ ఏపీకి వలస వెళ్లాడు. కాగా గంగవ్వ మంగళవారం కంటి పరీక్ష కోసం తన సమీప బంధువుతో కలిసి ముథోల్​లోని హాస్పిటల్ కు వెళ్లి వచ్చింది. రోజూలాగే అక్కాచెల్లెళ్లు ఇద్దరు తిని వేర్వేరు మంచాలపై నిద్రపోయారు. అయితే బుధవారం ఉదయం వృద్ధుల ఇంట్లో నుంచి పొగలు రావడం స్థానికులు గమనించారు. లోనికి వెళ్లి చెలరేగిన మంటలు ఆర్పివేశారు. అప్పటికే రాజవ్వ, గంగవ్వ మంచాలపై విగతజీవులై పడి ఉన్నారు. ఇద్దరిని విచక్షణా రహితంగా కొట్టిచంపినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. జిల్లా ఇన్​చార్జి సీపీ ప్రవీణ్, ఆర్మూర్ ఏసీపీ ప్రభాకర్ రావు, సీఐ సురేశ్​బాబు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నామని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీపీ తెలిపారు.


ప్లాన్​ ప్రకారమే హత్య
దాదాపు 20 ఏండ్లుగా రాజవ్వ, గంగవ్వ ఒకే ఇంట్లో ఉంటున్నారు. రాజవ్వ కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా, గంగవ్వ దగ్గరుండి చూసుకుంటోంది. అప్పుడప్పుడు గంగవ్వ కొడుకులు మహిపాల్, శ్రీనివాస్​ వీరి వద్దకు వచ్చిపోతుండేవారు. వృద్ధుల ఒంటిపై ఎప్పుడూ బంగారు నగలు ఉండటాన్ని గమనించిన వ్యక్తులే.. ప్లాన్​ప్రకారం కొట్టి చంపారని స్థానికులు అనుమానిస్తున్నారు. చంపేశాక ఇంటికి నిప్పు పెట్టి వెళ్లే క్రమంలో గ్యాస్ స్టవ్​వెలిగించారని తెలిపారు. మంటలు గమనించి ఆర్పివేయడంతో హత్య విషయం బయటపడిందని, లేకుంటే వృద్ధుల డెడ్​బాడీలు మంటల్లో కాలిపోయేవని చెప్పారు. 
 

చెల్లిని ప్రేమిస్తున్నాడని నరికి చంపిన అన్న


మునిపల్లి(కోహీర్): సంగారెడ్డి జిల్లాలో చెల్లిని ప్రేమిస్తున్న యువకుడిని ఆమె అన్న నరికి చంపాడు. జహీరాబాద్ సీఐ రాజు, కోహీర్​ఎస్సై సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. కోహీర్​మండలం పిచేర్యాగడి తండాకు చెందిన కేతావత్ సుదీప్(19) అదే తండాకు చెందిన ఓ మైనర్​ను ప్రేమిస్తున్నాడు. ఆ విషయం తెలుసుకున్న యువతి అన్న అరుణ్ సుదీప్​పై కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా అతన్ని హతమార్చాలని ఎదురుచూస్తున్నాడు. బుధవారం ఉదయం తండాలోని ఓ షాపు వద్ద ఉన్న సుదీప్ పై అరుణ్​గొడ్డలితో దాడిచేశాడు. తలకు తీవ్రగాయమై కుప్పకూలిన బాధితుడిని స్థానికులు జహీరాబాద్ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితుడు అరుణ్ పరారీలో ఉన్నాడని, మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు ఫైల్​చేసినట్లు వివరించారు.