Brydon Carse: క్రికెట్ నుంచి ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ సస్పెండ్.. కారణం ఏంటంటే..?

Brydon Carse: క్రికెట్ నుంచి ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ సస్పెండ్.. కారణం ఏంటంటే..?

క్రికెట్ లో మరొకరిపై నిషేధం పడింది. ఇంగ్లండ్ పేసర్ బ్రైడన్ కార్స్ క్రికెట్ బెట్టింగ్‌లకు  పాల్పడినందుకు అతనిపై మూడు నెలలు  ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు నిషేధం విధించింది. కార్స్ 2017 నుంచి 2019 వరకు 303 బెట్టింగ్‌లకు పాల్పడినట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు నిర్ధారించింది. ఈ ఇంగ్లాండ్ పేసర్ తన తప్పును అంగీకరించడంతో  రానున్న మూడు నెలల పాటు (మే 28 నుంచి 28 ఆగస్టు 2024) అతను ఎలాంటి క్రికెట్ ఆడేందుకు వీలు లేదు. 

కార్సే బెట్టింగ్‌లు వేసిన ఏ మ్యాచ్‌ల్లోనూ ఆడలేదని అర్థమవుతోంది. నిషేధ సమయంలో తిరిగి రావడానికి కృషి చేస్తానని కర్స్ అన్నాడు. వెస్టిండీస్‌తో జరిగే ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌కు కార్సే అందుబాటులో ఉండడు. శ్రీలంక పర్యటన సమయానికి అతనిపై నిషేధం ముగుస్తుంది. ECB ప్రతినిధి మాట్లాడుతూ.. "మేము ఈ విషయాలను చాలా సీరియస్‌గా తీసుకుంటాము. క్రికెట్‌లో ఏ విధమైన అవినీతి నిరోధక ఉల్లంఘనను క్షమించము." అని ఆయన చెప్పకొచ్చారు.  

బ్రైడెన్ కార్సే 2021లో పాకిస్థాన్‌పై అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు ఇంగ్లాండ్ తరపున 14 వన్డేలు,3 అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లు ఆడాడు. వన్డేల్లో 15 వికెట్లు తీసిన ఈ ఫాస్ట్ బౌలర్.. టీ20లో 4 వికెట్లు పడగొట్టాడు. 2023 వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ జట్టులో కార్స్‌ 15 మంది ప్రాబబుల్స్ లో చోటు దక్కించుకున్నాడు. త్వరలో ఇంగ్లాండ్ దిగ్గజం అండర్సన్ రిటైర్మెంట్ ప్రకటించనుండడంతో కార్స్ కు ఇంగ్లాండ్ జట్టులో ఎక్కువగా ఛాన్స్ లు వస్తాయని ఎక్స్ పర్ట్స్ అంటున్నారు.